టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా? | Ambati Rambabu Son in Law Upesh Fires on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా?

Feb 3 2026 6:23 AM | Updated on Feb 3 2026 6:23 AM

Ambati Rambabu Son in Law Upesh Fires on Chandrababu Govt

మాట్లాడుతున్న జక్కంపూడి రాజా. పక్కన అంబటి అల్లుడు ఉపేష్‌

అంబటి అల్లుడు ఉపేష్‌ సూటి ప్రశ్న

భవిష్యత్తులో చక్రవడ్డీతో చెల్లిస్తాం 

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

సాక్షి, రాజమహేంద్రవరం: ‘మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై టీడీపీ గూండాలు దా­డులు చేశారు. కార్లు, ఇల్లు ధ్వంసం చేశారు. ఆఫీస్‌ తగుల­బె­ట్టేశారు. అయినా వారిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమో­దు చేయలేదు’ అని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్‌ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబుతో ఉపేష్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నాయకుడు అనిల్‌రెడ్డి సోమవారం ములాఖత్‌ అయ్యారు. అనంతరం సెంట్రల్‌ జైలు బయట ఉపేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటిపై రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది.

వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు వచ్చి రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించారు. అంబటి రాంబాబుకు 24 గంటల్లో సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్‌ ఉంది. మీరు కేసు పెడతారా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.

పోలీసులు, సీఐలు వెంకటేశ్వర్లు, వంశీ అంబటిని టార్చర్‌ చేశారని, పెమ్మసాని చెప్పిన సినిమా చూపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్‌ ఆయిల్‌ కలిసిందని చంద్రబాబు, లోకేశ్‌ స్టేట్మెంట్లు ఇచ్చారని, డైవర్షన్‌ కోసమే హైడ్రామా సృష్టించారని దుయ్యబట్టారు. ‘గల్లా మాధవికి ఇల్లు లేదా? ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?’ అని హెచ్చరించారు. 

చంద్రబాబు కళ్లు తెరవాలి 
జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో తేలినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. దీనిని తప్పుపట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘మీరు ప్రారంభించిన సంప్రదాయాన్ని రేపు చక్రవడ్డీతో తిరిగి మీకు చెల్లిస్తాం’ అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

సెంట్రల్‌ జైల్‌కు అంబటి 
గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం వేకువజామున 3.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న అంబటికి స్నేహా బ్లాక్‌లో ఓ గది కేటాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement