నంద్యాల: చికెన్ సెంటర్ల దుకాణ యజమానుల వివాదంలో నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్‌బాషా తలదూర్చి ఓవరాక్షన్ చేసి బాధితులపై దాడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. బాధితురాలు రేణుక తెలిపిన మేరకు.. ఎస్బీఐ కాలనీలో జయరామిరెడ్డి, శివరామిరెడ్డిలకు చెందిన రెండు చికెన్ దుకాణాలు ఉన్నాయి. వీరి మధ్య వ్యాపార విషయంలో ఇటీవల విభేదాలు వచ్చాయి.
శివరామిరెడ్డి తమ దుకాణంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జయరామిరెడ్డి బంధువులు ఇంటి వద్దకు ఆదివారం రాత్రి అడిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమాచారం తెలుసుకున్న సీఐ అస్రార్‌బాషా గుమిగూడిన ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బాధితురాలు రేణుకను గొంతు పట్టుకొని షెట్టర్‌కు ఆనించి దాడి చేశారు. అక్కడే ఉన్న పూల వ్యాపారిని, రేణుక తమ్ముడు హేమేష్‌రెడ్డిలను రోడ్డుపైనే దాడి చేశారు. అనంతరం వారిని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
టూటౌన్ పోలీసు స్టేషన్ బయటి నుంచే తనను కొట్టుకుంటూ తీసుకెళ్లారని, స్టేషన్‌లోకి వెళ్లాక గొంతుపై, మెడపై బూటుకాలుతో తన్నారని హేమేష్‌రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై సీఐ దాడి చేయడం అవమానంగా భావించిన రేణుక స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ విషయంపై సీఐ అస్రార్‌బాషాను వివరణ కోరగా.. 30మంది దాకా ఎస్‌బీఐ కాలనీలో గుమిగూడి ఉన్నారని, వారిలో చాలా మంది తాగి ఉండటంతో ఘర్షణ జరుగుతోందని తెలిసి చెదరగొట్టామన్నారు. తాము, సిబ్బంది ఎవరిపైన దాడి చేయలేదని, ఇరువర్గాలపై చర్యలు తీసుకుంటామన్నారు.


