చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు దుర్మార్గం
నందికొట్కూరు: సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జూపాడుబంగ్లా మండలం కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించేందుకు ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభకు రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను సీఎం చంద్రబాబు నాయుడు నిలిపేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బాబు చీకటి ఒప్పందం ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో బట్టబయలు అయ్యిందన్నారు. సూపర్‌సిక్స్‌ను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరితే అక్రమ కేసులు పెట్టి భయంబ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పాటుపడకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడటం సరికాదన్నారు. సమావేశంలో జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు పోచా జగదీశ్వరరెడ్డి, సర్పంచు నాగార్జునరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు తిరుమలేరెడ్డి, మండ్లం రమణ, నక్క చిన్న మల్లయ్య, దినేష్, సురేష్, కదిరి పుల్ల్యయ, కృష్ణ, యశ్వంత్‌రెడ్డి, తరుణ్‌కుమార్‌రెడ్డి, సామేల్, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తే
అక్రమ కేసులా
రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాం
5న పోతిరెడ్డిపాడు సభను
విజయవంతం చేయండి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి


