ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలు: కూటమి నేతల అరాచకాలు, టీడీపీ నాయకుల గూండాయిజం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హెచ్చరించారు. కల్తీ నెయ్యి అంశంపై సిట్‌ చార్జిషీట్‌కు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి ఫొటోలతో తప్పుడు, అపవాదులు కలిగిన పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాటసాని ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోమవారం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ లడ్డూ వివాదాన్ని డైవర్షన్‌ చేయడానికి టీడీపీ గూండాలు మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందన్నారు. మాజీ మంత్రులు జోగి రమేష్‌, అంబటి రాంబాబు ఇళ్లపై దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కాటసాని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో

బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు?

హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారని కాటసాని నిలదీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ప్రజల్లో అశాంతికి కారణమైందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలు, మీడియా ముందు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు పొందిన ప్రయోగశాల నివేదికలు, తుది విచారణ ఫలితాలు లేదా చట్టపరమైన ఆధారాలను ప్రజల ముందు ఉంచకుండా ఆధార రహిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్‌ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రభుత్వ తప్పుడు విధానాలపై ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారన్నారు. రాజకీయంగా ప్రతిపక్ష నాయకులను మట్టుబెట్టేందుకు కుట్ర జరుగుతుందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, 2029లో వచ్చేది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్‌ బాంబులతో దాడులు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌లు ఏమి చేస్తున్నాయని నిలదీశారు. ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్సార్‌సీపీ భయపడదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు సుదర్శన్‌ రెడ్డి, అరుణ, వెంకటేశ్వర్లు, నాయకులు హనుమంతు రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement