బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
శ్రీశైలం టెంపుల్: సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని దేవదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం శ్రీశైలంలోని శరణ బసవేశ్వర సత్రంలోని హాల్‌లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, రోడ్లు, భవనాల వాఖ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. అలాగే దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరిజవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ముందుగా దేవస్థాన ఈఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నెల 8 నుంచి 18వ తేది వరకు నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఈ నెల 8 నుంచి 12వ తేది వరకు నిర్దిష్ట వేళల్లో స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. మంత్రి అనం మాట్లాడుతూ వీఐపీ, వీవీఐపీ, సిఫార్స్ లేఖల దర్శనాలకు ప్రత్యేక స్లాట్ కేటాయించి, నిర్ణయించిన సమయంలోనే దర్శనం కల్పించాలన్నారు. గత ఏడాది తరహాలోనే నాలుగు రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో టోల్‌గేట్ల వద్ద వాహనాలను ఉచితంగా అనుమతించాలని సూచించారు.
● మంచినీటి పైపులైన్లు ధ్వంసం
సాక్షి టాస్క్ ఫోర్స్: అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన టీడీపీ నాయకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మంచినీరు అందించే పైపులైన్లు ధ్వంసం చేశారు. దీంతో డోన్ మండంలోని వెంకటాపురం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు కొద్ది నెలల క్రితం మంచినీటి పైపులైను పగులగొట్టాడు. మరొక టీడీపీ నాయకుడు తానేమీ తక్కువ కాదు అన్నట్లు రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలో శివుని మాన్యం వద్ద ఉన్న మంచినీటి బోరు పైపులైను ధ్వసం చేశాడు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పుకుంటూ తిరుగుతున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి గ్రామంలో మంచినీటి సమస్యలు పట్టవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైనా ప్రజలు తూతూ మంత్రంగా హాజరయ్యారు. మంచినీటి సమస్యపై గ్రామ ప్రజలు సోమవారం డోన్‌కు వచ్చి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆమె.. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఎందుకు విజయవంతం చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామ ప్రజలు నిరుత్సాహంతో వెనుదిరిగారు. సమస్యను పరిష్కరించాల్సిన గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకుండి పోవడం ఆశ్చర్యం కల్గిస్తోందని గ్రామస్తులు తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధర క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు అన్ని మార్కెట్‌ల్లో వేరుశనగ ధరలకు రెక్కలొచ్చాయి. సోమవారం మూడు మార్కెట్‌ల్లో కూడా ధరలు తగ్గడం గమనార్హం. ఎమ్మిగనూరు మార్కెట్‌లో గరిష్ట ధర రూ.6,980, ఆదోనిలో రూ.8,900, కర్నూలు మార్కెట్‌లో రూ.9,790 లభించింది. ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో వేరుశనగ ధర దయనీయంగా ఉండగా.. కర్నూలు మార్కెట్‌లో కాస్త మెరుగ్గా ఉంది. ఇటీవల క్వింటా వేరుశనగ ధర రూ.15వేల వరకు చేరుకుంది.
పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు
కర్నూలు(హాస్పిటల్): జాతీయ డీవార్మింగ్ డే సందర్భంగా ఈనెల 17న విద్యార్థులందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్థులకు మాత్రలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా మాతా శిశు మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర అధికారులు డాక్టర్ నాగేంద్ర బాబు, డాక్టర్ మల్లికార్జున, డీపీఎంఓ డాక్టర్ శైలేష్ కుమార్, డెమో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు.


