ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలపై దాడులు జరిపింది.ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను మళ్లీ పుంజుకునేలా చేస్తోందన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు నిర్వహించింది. హిజ్బుల్లా కార్యకర్తలు ఇజ్రాయెల్ భూభాగం వైపు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను ప్రయోగించడానికి ఉపయోగించిన అల్-ఖియామ్ సమీపంలోని ఒక నిర్మాణాన్ని కూడా సైనికులు కూల్చివేసినట్లు సైన్యం తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లా (Hezbollah) చెందిన ఆయుధ నిల్వ గిడ్డంగులను లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులకు ముందు, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు, వాటిలో ఆ ప్రాంతంలోని జనాభాకు ముందస్తు ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఆయుధ కేంద్రాలలో ఒకటి జనసంచారం ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల మధ్యలో ఉంది. లెబనాన్ పౌరులను హిజ్బుల్లా 'మానవ కవచాలు' (Human Shields) వాడు కుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాల నుండి కార్యకలాపాలను కొనసాగిస్తోంది అనడానికి ఇదొక ఉదారణ అని పేర్కొంది. ఈ ఆయుధ కేంద్రాలు ఇజ్రాయెల్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని, అందుకే వాటిని తొలగించడం తప్పనిసరి అని IDF స్పష్టం చేసింది.
కాగా ఈ దాడులు కేవలం ఆకస్మికమైనవి కావు, దీని వెనుక కీలకమైన కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా ఎటువంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించ కూడదు. కానీ హిజ్బుల్లా మళ్లీ అక్కడ స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.
ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం, తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నంత కాలం లెబనాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. హెజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను పౌర గృహాల కింద, స్కూళ్ల సమీపంలో నిర్మించడం అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.


