జెరూసలేం: హెజ్‌బొల్లా (Hezbollah), హమాస్‌లపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. తాజాగా హెజ్‌బొల్లాకు అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహించిన ఆల్ మనార్ టీవీ ప్రజెంటర్ అలీ నూర్ అల్-దిన్‌ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది.
అలీ నూర్ అల్-దిన్ మరణంపై హెజ్‌బొల్లా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన ఇజ్రాయెల్ లెబనాన్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తుందని, అలీ నూర్ అల్-దిన్ ప్రాణాలు తీసిందని తెలిపింది.
గతంలో అల్-మనార్ ఛానెల్‌లో మతపరమైన కార్యక్రమాల న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసిన అలీ నూర్ టైర్‌లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. టైర్ శివారులోని అల్-హౌష్‌లో అల్-దిన్ ప్రధాన బోధకుడిగా కూడా పనిచేశాడు. లెబనీస్ సమాచార మంత్రి పాల్ మోర్కోస్ ఇజ్రాయెల్ తీరును ఖండించారు. ‘‘మీడియా కుటుంబానికి మా సంఘీభావం.అలీ నూర్ మరణానికి అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘనలు జరగకుండా లెబనాన్‌లోని మీడియా ప్రతినిధుల్ని రక్షించే దిశగా అడుగులు వేయాల’’ని కోరారు.


