నిన్న-మొన్నటి వరకూ ఇరాక్‌తో యుద్ధం చేసిన ఇజ్రాయిల్.. ఇప్పుడు లెబనాన్‌పై యద్ధం చేయడానికి సిద్ధమవుతుందా?, ఇజ్రాయిల్ సైనిక దళాలు తమ సరిహద్దు గోడను దాటి లెబనాన్‌లోకి వెళ్లడానికి కారణం ఏమిటి?, ఇజ్రాయిల్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఒక దేశం సైనిక దళాలు.. వేరొక దేశంలోకి ప్రవేశించాయంటే కారణం లేకుండా వెళ్లవు. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా తమ సరిహద్దు గోడను దాటి కేవలం 150 మీటర్ల దూరంలోకి వెళ్లాయి. దక్షిణ లెబనాన్‌లోని జెజైన్ జిల్లాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో ఇజ్రాయిల్ ఎయిర్‌క్రాఫ్ట్ దాడులకు కూడా పాల్పడిందని స్థానిక న్యూస్ ఏజెన్సీలు స్పష్టం చేయింది.
దీనిపై లెబనాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయిల్ దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని ఆరోపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు స్పందించాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బుల్లా ఆనవాళ్ల ఉన్నాయని అందుకే అక్కడ దాడులు చేశామని పేర్కొన్నాయి.
నెతన్యాహూ తిరిగొచ్చిన తర్వాతే ఈ దాడులు
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. నెతన్యాహూ అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మిలటరీకి ప్రత్యేక ఆదేశాల జారీ చేశారు. తాను తిరిగి వచ్చే వరకూ ఎటువంటి సైనిక చర్యలు ఉండొద్దని పేర్కొన్నారు. అయితే ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. ఆ దేశ సైనిక దళాలు.. లెబనాన్‌న టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.


