‘అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత’ | AI Impact Summit 2026 Concludes with Adoption of New Delhi Declaration | Sakshi
Sakshi News home page

‘అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత’

Feb 22 2026 1:03 AM | Updated on Feb 22 2026 1:03 AM

AI Impact Summit 2026 Concludes with Adoption of New Delhi Declaration

న్యూఢిల్లీ ‘ఏఐ ఇంపాక్ట్‌’ డిక్లరేషన్‌కు ఆమోదం  

86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థల సంతకాలు  

ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమమే ధ్యేయం  

ఏడు కీలక మూలస్తంభాలే డిక్లరేషన్‌కు ఆధారం  

ఏఐ టెక్నాలజీని పరస్పరం పంచుకోవాలని నిర్ణయం  

న్యూఢిల్లీ: ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను ప్రపంచ దేశాలు పరస్పరం పంచుకొనే దిశగా కీలకమైన ముందడుగు పడింది. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ(అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషం) అనే స్ఫూర్తితో భారత్‌ రూపొందించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్‌ ఆన్‌ ఏఐ ఇంపాక్ట్‌’ను ప్రపంచ దేశాలు ఆమోదించాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు సందర్భంగా శనివారం ఈ డిక్లరేషన్‌పై 86 దేశాలు, రెండు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. 

అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. మానవాళి బాగు కోసం ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధ ప్రయోజనాలను అందరూ సమానంగా పంచుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌ నిర్దేశిస్తోంది. 

అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, బహుళ భాగస్వాముల మధ్య అనుసంధానం, దేశాల జాతీయ సార్వ¿ౌమత్వాన్ని గౌరవించడం, ఏఐని మరింత ముందుకు తీసుకెళ్లడం, ఏఐ టెక్నాలజీ వినియోగంలో భద్రమైన, విశ్వసనీయమైన ఫ్రేమ్‌వర్క్‌ నిర్మించడం డిక్లరేషన్‌ ప్రధాన లక్ష్యం. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఏఐ సాంకేతికతను అందించడమే ధ్యేయం.  

అంతర్జాతీయ సహకారమే పునాది  
ఏడు కీలకమైన మూలస్తంభాల ఆధారంగా న్యూఢిల్లీ డిక్లరేషన్‌ రూపొందించారు. ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ, ఆర్థిక వృద్ధి–సామాజిక సంక్షేమం, భద్రమైన–విశ్వసనీయమైన ఏఐ, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఏఐ, సామాజిక సాధికారత సాధన, హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్, సుస్థిరమైన, ప్రభావవంతమైన, నూతన ఏఐ వ్యవస్థల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. 

డిక్లరేషన్‌కు అంతర్జాతీయ ఏఐ సహకారమే పునాదిగా నిలుస్తోంది. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు’శనివారం ఈ డిక్లరేషన్‌ ఆమోదంతో ముగిసింది. ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసం ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని సదస్సులో పాల్గొన్న దేశాలు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.

 ప్రపంచ ఆర్థిక పరివర్తనలో ఏఐ పోషించబోయే పాత్రను డిక్లరేషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ ఎకోసిస్టమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు. తక్కువ ఇంధనంతో పనిచేసే ఏఐ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైన్స్, పరిపాలన, ప్రజాసేవల పంపిణీలో ఏఐ వినియోగం పెంచుకోవాలని స్పష్టంచేశారు.  

ఈయూ, ఐఎఫ్‌ఏడీ ఆమోదం  
న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన వాటిలో రష్యా, ఆ్రస్టేలియా, బెల్జియం, భూటాన్, బ్రెజిల్, కెనడా, డెన్మార్క్, ఇస్తోనియా, ఇథియోపియా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, ఐర్లాండ్, ఇండోనేసియా, ఇరాన్, హంగేరీ, గ్రీస్, జర్మనీ, ఫిన్‌లాండ్, మెక్సికో, యూఏఈ, ఉక్రెయిన్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, టాంజానియా, స్విట్జర్లాండ్, నార్వే, ఒమన్, ఫిలిప్పైన్స్, పెరూ, రొమేనియా, నేపాల్, మయన్మార్, న్యూజిలాండ్‌ తదితర దేశాలున్నాయి. అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఏడీ) సైతం డిక్లరేషన్‌ను ఆమోదించాయి.  

సమతుల్యం అత్యంత కీలకం: అశ్వినీ వైష్ణవ్‌  
ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘మానవ కేంద్రీకృత ఏఐ దార్శనికత’ను ప్రపంచదేశాలు ఆమోదించాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. కృత్రిమ మేధ వనరులను ప్రజాస్వామీకరించడం వల్ల ఏఐ సేవలు, సదుపాయాలు, సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమాన్ని సమతుల్యం చేసుకోవడం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. 

ఆర్థిక ప్రగతిని మాత్రమే కాకుండా సామాజిక  సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ వినియోగంలో భద్రత, విశ్వాసం ముఖ్యమైన అంశాలేనని చెప్పారు. భద్రమైన, విశ్వసనీయ, బలమైన ఐఏ ప్రేమ్‌వర్క్‌ను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ పరస్పరం కలిసి పని చేయడానికి ముందుకొచ్చాయని వైష్ణవ్‌ స్పష్టంచేశారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ సూక్తిని ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఆమోదించాయని స్పష్టంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement