ఇజ్రాయెల్‌తో ప్రధాని మోదీ బిగ్ డీల్? | India To Explore Anti Ballistic Missile Defence Collaboration With Israel, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌తో ప్రధాని మోదీ బిగ్ డీల్?

Feb 21 2026 12:02 PM | Updated on Feb 23 2026 4:19 PM

India to explore anti ballistic missile defence with Israel

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముఖచిత్రంపై భారత్, ఇజ్రాయెల్ దేశాల మైత్రి మరో చరిత్రాత్మక ఘట్టానికి చేరుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25 నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండ్-ఆఫ్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్ల ఉమ్మడి అభివృద్ధిపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరగనున్నాయి.

ఈ పర్యటనలో భద్రతా సహకారంపై ఇరు దేశాలు అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోనున్నప్పటికీ, తక్షణమే ఎటువంటి రక్షణ కొనుగోలు ఒప్పందాలు జరగవని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం అనేది నిరంతర ప్రక్రియ. రాబోయే ఏళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ తన అత్యంత రహస్యమైన, అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్‌తో పంచుకోవడానికి అంగీకరించడం గమనార్హం. గత నవంబర్‌లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి.

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిషన్ సుదర్శన్'లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. లాంగ్ రేంజ్ ‘ఆరో’, మీడియం రేంజ్ ‘డేవిడ్స్ స్లింగ్’ షార్ట్ రేంజ్ ‘ఐరన్ డోమ్’ వ్యవస్థలు అత్యంత ప్రభావవంతమైనవి. గత ఏడాది జూన్‌లో ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ 98 శాతం విజయవంతంగా అడ్డుకోవడమే ఈ సామర్థ్యానికి నిదర్శనం. రక్షణ రంగంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, స్వచ్ఛమైన తాగునీరు మరియు క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్‌.. ఆలయాలకు భద్రత పెంపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement