70.68 శాతం వాటా విక్రయం
డీల్ విలువ రూ. 1,446 కోట్లు
న్యూఢిల్లీ: స్విస్ దిగ్గజం నోవార్టిస్ ఏజీ తాజాగా దేశీ విభాగంలో మెజారిటీ వాటా విక్రయించింది. దేశీ ఫార్మా బిజినెస్ నోవర్తిస్ ఇండియా లిమిటెడ్‌లో 70.68 శాతం వాటా అమ్మివేసేందుకు క్రిస్‌క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,446 కోట్ల విలువైన డీల్‌కు తెరతీసింది. 2026 అక్టోబర్–డిసెంబర్‌కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా. కాగా.. తాజా డీల్ నేపథ్యంలో నోవార్టిస్ ఇండియా వాటాదారులకు క్రిస్‌క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది.
నిబంధనల ప్రకారం పబ్లిక్ నుంచి 26 శాతం వాటా కొనుగోలు చేపట్టవలసి ఉంది. వెరసి షేరుకి రూ. 860.64 ధరలో 64,19,608 షేర్ల కొనుగోలుకి ఆఫర్ ఇవ్వనుంది. ఇందుకు రూ. 552 కోట్లకుపైగా వెచి్చంచనుంది. నోవార్టిస్ గ్రూప్ పూర్తి అనుబంధ సంస్థ నోవార్టిస్ హెల్త్‌కేర్ ప్రయివేట్ ద్వారా నోవర్తిస్ ఏజీ దేశీయంగా కార్యకలాపాలు కొనసాగించనుంది. హైదరాబాద్‌లోని నోవార్టిస్ కార్పొరేట్ సెంటర్, దేశీయంగా 300 ప్రాంతాలలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఆర్‌అండ్‌టీ బృందాలు హెల్త్‌కేర్ విభాగంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నోవార్టిస్ ఇండియా షేరు బీఎస్‌ఈలో అమ్మకందారులు కరవుకావడంతో 20 శాతం అప్పర్ సీలింగ్‌ను తాకి రూ. 997 వద్ద నిలిచింది.


