భారతీయ విలాసవంతమైన కార్ల ప్రియులకు, టెక్ ప్రియులకు ఇక పండగే! భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా పిలవబడే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో యూరప్ నుంచి భారత్‌లోకి వస్తున్న యూరోపియన్ బ్రాండెడ్ కార్లు, అత్యున్నత స్థాయి వైద్య పరికరాలు, దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గనున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో భారత మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేయబోతున్న ఈ ఒప్పందం వివరాలు, ఏయే వస్తువులపై సుంకాలు ఎంత మేర తగ్గుతాయో కింద చూద్దాం.
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వచ్చే దశాబ్ద కాలంలో భారత దిగుమతి మార్కెట్‌ను సమూలంగా పునర్నిర్మించేలా, కీలక రంగాల్లో భారీగా సుంకాలు తగ్గనున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆటోమొబైల్ రంగంలో..
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం కార్లపై సుంకాల తగ్గింపు. ప్రస్తుతం 70% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని భారత్ క్రమంగా 10%కి తగ్గించనుంది. ఏడాదికి 2,50,000 వాహనాల వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ మార్పు భారత ప్రీమియం కార్ల మార్కెట్‌ను పూర్తిగా రీసెట్ చేస్తుందని ఈయూ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఎగుమతులు - సుంకాల ఆదా
2032 నాటికి భారతదేశానికి ఈయూ ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. 90% పైగా వస్తువులపై సుంకాల తగ్గింపు ఉంటుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల మేర ట్యాక్స్ ఆదా అవుతుందని బ్రస్సెల్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గరిష్టంగా ఉన్న సుంకాలు (యంత్రాలపై 44%, రసాయనాలపై 22%, ఫార్మాపై 11%) గణనీయంగా తగ్గనున్నాయి.
వైద్యం, సాంకేతిక రంగం
భారతదేశంలో వైద్య సేవల ఖర్చులను తగ్గించే దిశగా ఈ ఒప్పందం దోహదపడనుంది. దాదాపు అన్ని వైద్య పరికరాలపై సుంకాలను సున్నాకి తగ్గించనున్నారు. 90% ఉత్పత్తులపై సుంకాలు తొలగిపోతాయి. దీనివల్ల ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. విమానాలు, అంతరిక్ష నౌకలకు సంబంధించి దాదాపు పూర్తిస్థాయిలో సుంకాల తొలగింపు ఉంటుంది.
ఆహారం, పానీయాలు
యూరప్ నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ పానీయాలపై సుంకాలను భారత్ భారీగా తగ్గించింది. యూరోపియన్ వైన్‌లపై 20 నుంచి 30 శాతం వరకు సుంకాలు తగ్గనుండగా వివిధ రకాల స్పిరిట్లపై 40 శాతం వరకు రాయితీ లభించనుంది. అన్నిటికంటే ఎక్కువగా యూరోపియన్ బీరుపై ఏకంగా 50 శాతం మేర సుంకాలు తగ్గనున్నాయి.
కేవలం పానీయాలకే పరిమితం కాకుండా వంట గదిలో అత్యవసరమైన ఆహార నూనెలపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుంది. ఐరోపా నుంచి వచ్చే ఆలివ్ ఆయిల్, మార్గరీన్, ఇతర వెజిటబుల్ ఆయిల్స్‌పై ఉన్న దిగుమతి సుంకాల్లో ప్రభుత్వం భారీ కోత విధించింది. దీనివల్ల భారతీయ వినియోగదారులకు నాణ్యమైన యూరోపియన్ ఉత్పత్తులు తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత ఎగుమతులకు లబ్ధి
ఏడేళ్ల వ్యవధిలో 99.5% వాణిజ్య వస్తువులపై ఈయూ కూడా సుంకాలను తగ్గించనుంది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అందులో..
సముద్ర ఉత్పత్తులు, తోలు, వస్త్రాలు.
రసాయనాలు, రబ్బరు, రత్నాలు, ఆభరణాలు.
ఈ ఒప్పందం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత వినియోగదారుల మార్కెట్‌లో యూరప్ పట్టును బలోపేతం చేయనుంది. అయితే, యూరోపియన్ ఉత్పత్తుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకునేలా దేశీయ తయారీదారులు ఏ విధంగా సిద్ధమవుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?


