రన్నరప్‌గా ముగింపు | India loses 0-2 to England in FIH Women’s World Cup Qualifers Final | Sakshi
Sakshi News home page

రన్నరప్‌గా ముగింపు

Mar 15 2026 3:33 AM | Updated on Mar 15 2026 3:33 AM

India loses 0-2 to England in FIH Women’s World Cup Qualifers Final


ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓటమి  

మహిళల వరల్డ్‌ కప్‌ హాకీ క్వాలిఫయింగ్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: హాకీ ప్రపంచ కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నిలో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో చెలరేగి ఆడిన భారత మహిళల జట్టు చివరి మెట్టుపై 
నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 0–2 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ తరఫున 13వ నిమిషంలో గ్రేస్‌ బాల్స్‌డన్, 43వ నిమిషంలో ఎలిజబెత్‌ నీల్‌ గోల్స్‌ సాధించారు. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా భారత మహిళల బృందం ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌ వేదికగా జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. 

మ్యాచ్‌ ఆరంభంనుంచి భారత్‌ దూకుడు ప్రదర్శించింది. రెండో నిమిషంలోనే జట్టుకు పెనాల్టీ కార్నర్‌ అవకాశం లభించింది. అయితే దీనిని నిలువరించడంలో ఇంగ్లండ్‌ గోల్‌ కీపర్‌ సఫలమైంది. తొలి క్వార్టర్‌ ముగియడానికి కొద్ది సేపు ముందు లి క్వార్టర్‌లో భారత్‌ జోరు ప్రదర్శించినా...రెండో క్వార్టర్‌ నుంచి ఇంగ్లండ్‌కు ఆటపై పట్టు చిక్కి ఆ జట్టు వరుసగా దాడులు చేసింది. చివరకు పెనాల్టీ సాధించిన టీమ్‌కు బాల్స్‌డన్‌ గోల్‌ అందించింది. ఈ టోర్నికి ఆమెకిది ఐదో గోల్‌ కావడం విశేషం. రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్‌ సాధించే అవకాశం దక్కలేదు. 23వ నిమిషంలో దక్కినా పెనాల్టీని భారత్‌ వాడుకోలేకపోయింది.

అయితే మూడో క్వార్టర్‌ చివర్లో భారత డిఫెన్స్‌ను ఛేదించి దూసుకుపోయిన ఎలిజబెత్‌ గోల్‌ కీపర్‌ బిచ్చుదేవిని ఏమార్చడంలో సఫలమై ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ ఆధిక్యాన్ని సరైన డిఫెన్స్‌తో కాపాడుకోవడంలో ఇంగ్లండ్‌ సఫలమైంది. మ్యాచ్‌ ముగియడానికి ఒక నిమిషం ముందు కూడా భారత్‌కు పీసీ దక్కినా అదీ వృథా అయింది. దాంతో గోల్‌ లేకుండా ఓటమి తప్పలేదు. భారత్‌ మొత్తంగా నాలుగు పెనాల్టీ కార్నర్లను కూడా ఉపయోగించుకోలేకపోయింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో స్కాట్లాండ్‌ 1–0తో ఇటలీని ఓడించింది. భారత్‌కు చెందిన నవనీత్‌ కౌర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement