జీవితం ఎప్పుడు అందరికీ ఒకేలాంటి కష్టాలు, సవాళ్లను ఇవ్వదు. ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కొందరికి పెద్దయ్యాక కష్టాలు వెంటాడితే మరికొందరికి పుట్టుకతో కష్టాలు వెంటాడతాయి. అంతేగాదు ఆ దుర్భరమైన జీవితం సాగించలేక కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయ్. అయినా తట్టుకుని నిలబడిన వాడికే మంచిజీవితం లభిస్తుంది, గొప్ప స్థాయికి చేరుకుంటారు అనేందుకు ఈ ఢిల్లీ మహిళ కథే ఉదాహరణ. ఈమె కథ వింటే 'బిచ్చగాడు' మూవీలోని
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం
జానెడంత ఊపిరి కోసం చెయ్యి చాచడం
కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్న
మనిషి అన్న వాడికి మనసే లేకపోయెనన్నా అన్న పాట గుర్తొస్తుంది. మరి ఆమె పడ్డ కష్టాలు..ఎలా వాటిని అధిగమించి ఉన్నతస్థాయి చేరుకుందో సవివరంగా చూద్దామా.!.
ఆ మహిళే లిలీమా ఖాన్. ఢిల్లీలోని తైమూర్ నగర్‌కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు ఒక సోదరుడు. తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడేవారు. అయినప్పటికీ..మూడేళ్ల వయసున్న లిలీమా తన తండ్రి ఇరుగుపొరుగు వారి కోసం ప్రేమగా వండే కిచిడీ, రోటీ వంటి సాదాసీదా భోజనం వండటం చూసేది. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితం ఆకస్మికంగా కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.
మొదట 2001లో, లిలీమాకు కేవలం ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తండ్రి కన్నుమూశారు. ఆరు నెలల తర్వాత, ఆమె తల్లి క్షయ వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన కళ్లముందే అక్క వైవాహిక సమస్యలతో మరణించడం చూసింది. ఈ వరుస కష్టాలు ఆమెను కుంగదీస్తుంటే..మరోవైపు సోదరుడు డ్రగ్స్‌కి బానిసై దొంగతనాలకు అలవాటుపడటంతో జైలుపాలయ్యాడు.
దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిపోయింది లిలీమా. అయితే ఆమె అత్త తన తమ్ముడిని చేరదీసింది గానీ ఆమెను మాత్రం దగ్గరకు తీసుకోలేదు. దాంతో అనాధగా మిగిలిన లిలీమాను తైమూర్ నగర్ మురికివాడలకు చెందిన ఒక మహిళ ఆశ్రయం ఇచ్చినా..ఒక పూట భోజనం కోసంతెల్లవారుజామున ఫ్రెండ్స్ కాలనీ వీధుల్లో చెత్త ఏరడానికి ఇతర పిల్లల తోపాటు పంపేది.
అక్కడ మాల్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి ప్రాంతాల్లో చెత్తబుట్టల్లో వెతుకుతూ, మిగిలిపోయిన చికెన్ లేదా మటన్ ఎముకలు, సగం తిన్న బర్గర్‌లను తింటూ గడిపేది. అలా కష్టాలు పడుతున్న లిలీమాను 11 ఏళ్ల వయసులో ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) సహాయం అందించి, చదువు చెప్పించడంతో ఆమె పరిస్థితి మెరుగవ్వడం ప్రారంభమైంది. అయితే కొద్దికాలానికే తిరిగి వచ్చి..తన అత్త, తమ్ముడి వద్దకు వచ్చి..అక్కడే ఉండేందుకు ఇష్టపడింది. అయితే లిలీమా అత్త ఆమెను అక్కడ షుఫ్యాక్టరీలో పనికి పెట్టింది.
ఆ వ్యక్తి రాకతో చిగురించిన జీవితం..
సరిగా పనిచేయకపోతే అత్త చేతిలో దెబ్బలు తింటూ మళ్లీ కష్టాల కడలిలో చిక్కుకుంది. ఆ తర్వాత ఎన్జీవో కార్యకర్త హర్ష్ మందర్‌ను సంప్రదించింది. ఆయన కాశ్మీరీ గేట్‌లోని బాలికల అనాథాశ్రమమైన కిల్కారి రెయిన్‌బో హోమ్‌లో చేరడానికి సహాయం చేశారు. అక్కడే ఉన్న సమయంలో లిలీమాకు వంటపై ఆసక్తి కలిగింది. అయితే 2015లో, అనాథాశ్రమానికి తరచుగా వచ్చే ఒక సందర్శకుడు లిలీమా వంట నైపుణ్యాలను గమనించి, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌లో ఆమెకు ఉద్యోగం ఇప్పించారు.
అక్కడ సిబ్బందికి భోజనం తయారుచేయడమే లిలీమా ఉద్యోగం. అందుకు రూ. 7000లు జీతం ఇచ్చేవారు. అలా తన వంట నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో అక్కడుండే హెడ్ చెఫ్ వద్ద మ్యాష్డ్ పొటాటోస్ తయారుచేయడం, బర్గర్లు, సలాడ్‌లను చేయడం వంటి ప్రాథమిక విషయాలను నేర్చుకుంది. 2019లో, లిలీమా 'డియర్ డోనా'లో చెఫ్ డి పార్టీగా చేరి, ఒక్క ఏడాదిలోనే సూస్ చెఫ్‌గా పదోన్నతి పొందింది.
ఇవాళ ఆమె 35 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె తయారు చేసే ప్రత్యేక వంటకాల్లో రిసోటో, రావియోలీ, సాల్మన్ గ్రావ్‌లాక్స్, రౌలేడ్, బీఫ్ వెల్లింగ్టన్ తదితరాలు ఉన్నాయి. తన అభిరుచినే బలంగా మార్చుకుని ముందుకు సాగి జీవితాన్ని అందంగా మలుచుకుంది. మన నైపుణ్యం, ఆసక్తులే మనల్ని మందుకు నడిపించే ఆస్తులనే లిలీమా కథ చెప్పకనే చెబుతోంది కదూ..!.
(చదవండి: పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్‌గా కరీనా కపూర్! ఏకంగా రూ. 1.3 లక్షల..)


