తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్‌ఆర్‌టీసీ)ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించే ‘ప్రియదర్శిని’ పథకాన్ని సోమవారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తిరువనంతపురంలోని తంబానూర్ బస్ టెర్మినల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించి, మహిళా ప్రయాణికులకు సరికొత్త కానుకను అందించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్ రిబ్బన్ కట్ చేసి, ఈ సేవలను ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు వీలుగా, కేరళవ్యాప్తంగా ఉన్న అన్ని కేఎస్‌ఆర్‌టీసీ డిపోల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రారంభోత్సవ కార్యక్రమాలను సైతం నిర్వహించారు.
VIDEO | Kerala: Chief Minister VD Satheesan formally inaugurates the state government’s flagship ‘Priyadarshini’ free travel scheme for women and transgender individuals.
This scheme is part of the UDF government’s ‘Indira Guarantee’ initiative that opens up free transit across… pic.twitter.com/r8ABPsSSS8— Press Trust of India (@PTI_News) June 15, 2026
గుర్తింపు కార్డులు అవసరం లేదు
ఈ పథకానికి సంబంధించి రవాణా సంస్థ నిబంధనలను వెల్లడించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందడానికి మహిళలు లేదా ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రయాణం ఉచితమే అయినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య, రికార్డుల కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ‘జీరో-ఫేర్’ టికెట్‌ను మాత్రం తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, పథకం అధికారికంగా ప్రారంభమైన సమయం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.
3,125 బస్సుల్లో ఉచిత సేవలు
ప్రస్తుతానికి కేరళ రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 3,125 కేఎస్‌ఆర్‌టీసీ సాధారణ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు ఈ బస్సులను సులభంగా గుర్తించేందుకు వీలుగా, వీటికి ప్రత్యేకంగా ‘ప్రియదర్శిని’ అనే స్టిక్కర్లను కూడా అంటించారు. కేరళ ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళా లోకం నుంచి హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఈ పథకంపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సుల యూనియన్ల నుంచి సమ్మె హెచ్చరికలు కూడా వస్తున్నాయి.


