లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి ఆధిత్యనాథ్ అండగా నిలిచారు. అఖిలేష్ యాదవ్ కుమార్తెపై జరిగిన ట్రోలింగ్ ,ఆమె ఫోటోల మార్ఫింగ్ వ్యవహారంలో న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. అందుకు కారణమైన నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలతో కాన్పూర్ కమిషనరేట్‌లో సైబర్ విభాగం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
జూన్ 9న భారత్ కుమార్ పటేల్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్లలో అఖిలేష్ యాదవ్ కుమార్తె మార్ఫింగ్ ఫోటోల్ని షేర్ చేశాడు. ఆమెపై దొంగతనం, క్రిమినల్ కార్యకలాపాలకు అనుసంధానం చేస్తూ ఓ ఫొటో ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో రూ. 955 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న సీఎం యోగి మాట్లాడారు.
ఇటీవల సోషల్ మీడియాలో అఖిలేష్ యాదవ్ కుమార్తెపై కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం నా దృష్టికి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను పోలీసులను ఆదేశించానని అన్నారు. కూతురు అంటే అందరికి కూతురే. సోదరి అంటే అందరి సోదరియేననే విలువల మధ్యే మనం పెరిగాం. మేము ఎప్పుడూ ఇందులో ఎలాంటి వివక్ష చూపించలేదు’అని ఆయన పేర్కొన్నారు.
తాను ఆదేశాలు జారీ చేసిన వెంటనే పోలీసులు సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు ఎవరు పెట్టారో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. నిందితులపై వేగంగా తీసుకున్న పోలీసుల చర్యను సమర్థించారు.
అదే సమయంలో అఖిలేష్ యాదవ్‌కు ఒక సలహా కూడా ఇచ్చారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, సీనియర్ నాయకుల పట్ల దుర్భాషలాడకుండా తన సొంత పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను నియంత్రించుకోవాలని సూచించారు. అఖిలేష్ జీ.. మీరు ఇతరులకు సలహాలు ఇస్తుంటారు. కానీ మీ అనుచరులు, కార్యకర్తలు కూడా వారి భాషను అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి’ అని సూచించారు. వారికి మీరే అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది, ఒకవేళ వారు వినకపోతే, వారిని మాకు అప్పగించండి. వారికి ఎలా బుద్ధి చెప్పాలో మేము సరిగ్గా చెప్తాం’అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.


