జోరున వర్షం.. బస్ షెల్టర్‌లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్‌లోని జేఎల్‌ఎన్ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?
ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్‌లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…
— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026
సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..
“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్‌లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్‌లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో దుమారం
ఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.


