సాక్షి,ఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించిన అంశంలో పార్లమెంటు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాలపరిమితిని పొడిగిస్తూ ఆమోదం తెలిపింది. వచ్చే శీతాకాల సమావేశాల చివరి వారం వరకు జెపీసీ గడువును పొడగించింది.
జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల కోసం డిసెంబర్ 23, 2024 బీజేపీ సీనియర్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో అనురాగ్ ఠాకూర్ , ప్రియాంకా గాంధీ , ధర్మేంద్ర యాదవ్ , మనీష్ తివారీ , సుప్రియా సూలే వంటి ప్రముఖ రాజకీయ నేతలు సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని చట్టబద్ధంగా ఎలా అమలు చేయాలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
కమిటీ విధులు
కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కమిటీ లైన్-బై-లైన్ పరిశీలిస్తుంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని మార్చడానికి రాజ్యాంగంలోని 5 కీలక అధికరణలను (Articles 83, 85, 172, 174, 356) మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల సమాఖ్య వ్యవస్థకు ఏవైనా ఇబ్బందులు వస్తాయా అని కమిటీ చర్చిస్తుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు, ఆర్థికవేత్తల నుంచి సాక్ష్యాలు, సలహాలను సేకరిస్తుంది.ప్రధానితో పాటు ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఐదేళ్ల కంటే ముందే పడిపోతే, మళ్లీ జమిలి ఎన్నికల చక్రంలోకి ఆ రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలనే దానిపై అంతర్జాతీయ నమూనాలను పరిశీలిస్తోంది.
అయితే కమిటీ తన రిపోర్టును 2026 వర్షాకాల సమావేశాలలోనే పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంది. అయితే జమిలి ఎన్నికల బిల్లులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో జరుపుతున్న సంప్రదింపులు ఇంకా పూర్తి కాలేదు. కమిటీ ఇప్పటికే 10 కి పైగా రాష్ట్రాల్లో పర్యటించినప్పటికీ, నివేదికను సంపూర్ణంగా సిద్ధం చేయడానికి మరికొంత సమయం అవసరమని భావించింది. దీంతో మరికొంత గడువు కావాలని పార్లమెంటును అభ్యర్థించింది. దీంతో కొత్త గడువు ప్రకారం ఈ నివేదికను 2026 శీతాకాల సమావేశాల చివరి వారపు మొదటి రోజు నాటికి సమర్పించాల్సి ఉంటుంది.


