వచ్చే ఏడాది నుంచి జనగణన షురూ | India Census to begin next year | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి జనగణన షురూ

Dec 3 2025 3:58 AM | Updated on Dec 3 2025 3:58 AM

India Census to begin next year

2026 ఏప్రిల్‌ నుంచి 2027 ఫిబ్రవరిదాకా రెండు విడతల్లో జనాభాలెక్కల సేకరణ

లోక్‌సభలో ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేషన్‌ కార్డుల జారీ మొదలు వృద్ధాప్య పెన్షన్ల దాకా పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులను గణించడంతోపాటు దేశ జనాభా సరళిని తెలియజెప్పే అత్యంత కీలకమైన జనగణన క్రతువు ఎట్టకేలకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఆరంభంకానుంది. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. రెండు విడతల్లో జనగణనను పూర్తిచేస్తారు. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌దాకా తొలి విడత పూర్తిచేసి 2027 ఫిబ్రవరిలో మలివిడతతో ముగిస్తారు. 

తొలి విడతలో దేశంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి, నివాస ప్రాంతాల్లో పక్కా గృహాలు ఎన్ని, ఎన్ని అంతస్తుల్లో భవనాలు నిర్మించారు? పూరి గుడిసెలు ఎన్ని? కాంక్రీట్‌ నిర్మాణాలు ఎన్ని? ఏఏ రకం ముడి పదార్థాలతో ఏ తరహా ఇల్లు నిర్మించారు? ఇలా ఇళ్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో విడతలో ఆయా ఇళ్లలో ఉంటున్న కుటుంబాలెన్ని? కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు? వారి పేరు, వయసు వంటి వివరాలు సేకరిస్తారు. 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ప్రతి 30 రోజులకు ఒక కాలావధిగా తీసుకుని లెక్కిస్తారు. 2027 మార్చి ఒకటోతేదీని రిఫరెన్స్‌ తేదీగా లెక్కలోకి తీసుకుంటూ 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు మొదలెడతారు. 

మంచు, అతి చలి, అననుకూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లద్దాఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో అనువైన సమయాల్లోనే జనగణన చేపట్ట నున్నారు. ఇక్కడ 2026 అక్టోబర్‌ ఒకటోతేదీని రెఫరెన్స్‌ తేదీగా తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు అందించే సలహాలు, సూచనలతోపాటు పాత డేటాను లెక్కలోకి తీసుకుని జనగణన ప్రశ్నావళిని ఖరారుచేశామని మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న కేంద్ర కేబినెట్‌ కమిటీలో నిర్ణయించిన మేరకు ఈసారి కులగణన సైతం చేపట్టనున్నారు. స్వీయ జనగణనతోపాటు మొబైల్‌ యాప్‌ల సాయంతో ఈసారి డిజిటల్‌ రూపంలో జనగణన–2027 కొనసాగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement