భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇప్పటివరకూ 1,104 అక్రమ చొరబాట్ల సంఘటనలు జరిగాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మంగళవారం జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆయన మాట్లాడారు. భారత్‌తో సరిహాద్దు చొరబాట్లపై లోక్‌సభలో ఆయన వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
2025 సంవత్సరం నవంబర్ నాటికి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు, ఇతర అంశాలపై కేంద్రమంత్రి లోక్‌సభలో వివరాలు అందించారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్న వారిలో అధికంగా 1,104 చొరబాట్లు బంగ్లాదేశ్ నుండే జరిగాయన్నారు. వారిలో 2,556 మందిని అరెస్టు చేశామన్నారు. వీటితో పాటు చైనా, పాకిస్థాన్, నేపాల్, భూటాన్, మయన్మార్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు జరిగాయని వారందరినీ అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇండియా- బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుందని తెలిపారు. ఆ ప్రదేశంలో దాదాపు 79 శాతం ప్రాంతానికి కంచె ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో 2,289 కిలోమీటర్ల మేర బార్డర్ ఉండగా దానిలో 93 శాతంగా పైగా ఫెన్సింగ్ పూర్తయినట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 8,500 చొరబాటు ఘటనలు జరగగా 20,800మందిని అరెస్టు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
కేంద్రమంత్రిత్వ శాఖ నివేదిక 2014-2024
బంగ్లానుంచి 7,500 చొరబాటు ఘటనలు జరుగగా 18,800 మంది అరెస్టు.
పాకిస్థాన్ నుంచి 420 చొరబాటు ఘటనలు 560 మంది అరెస్టు.
మయన్మార్ నుంచి 290 ఘటనసలు జరుగగా 1,150 మంది అరెస్టు.
నేపాల్, భూటాన్ నుంచి 160 ఘటనలు జరుగగా 260 మంది అరెస్టు జరిగినట్లు కేంద్ర సహాయ మంత్రి పార్లమెంటులో నివేదిక సమర్పించారు.


