కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి, అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్ త్వరలో ప్రజస్వామ్య వేడుకకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ దేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హసినా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుపుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ నసిరుద్దీన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దయచేసి ప్రజలెవరూ ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాలలో ఉన్న దేశీయులు ఓటుకోసం డిసెంబర్12 నుంచి 25వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అయితే వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలుశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల్లో హాసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత్‌ను అభ్యర్థిస్తుంది. అయితే బంగ్లాదేశ్ వెళ్లే నిర్ణయం స్వయంగా షేక్ హసీనానే తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.
షేక్ హసీనా తొలిసారిగా 1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకూ వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హాసీనాకు చెందిన పార్టీ ఆవామీ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనానే కాకుండా ఆమె పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు.


