పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే విశ్వవిద్యాలయాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ రెండు దేశాల విద్యార్థుల వీసాలను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల వీసా దరఖాస్తుల తిరస్కరణకు కారణాలేమిటి?. వర్సిటీల నిర్ణయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ పరిస్థితి ఏంటి?..
పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థి వీసాలపై అమెరికా ఆంక్షలు తీవ్రం కావడంతో ఇప్పుడు ఆయా దేశాల విద్యార్థులు యూకేపై దృష్టి సారించారు. అయితే, ఇప్పటికే బ్రిటన్‌లో స్థానిక ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. వలసలను అరికట్టాలని పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. విద్యార్థి వీసాల ముసుగులో బ్రిటన్‌కు వస్తున్న వారు ఇక్కడే సెటిలైపోతున్నారని, అక్రమ వలసదారులుగా కొనసాగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూకే ఇమిగ్రేషన్ విభాగం ఈ తరహా వలసలపై ఫోకస్ పెట్టింది.
ఏయే విశ్వవిద్యాలయాలు తిరస్కరిస్తున్నాయి?
కోవెంట్రీ, చెస్టర్ వంటి 9 విశ్వవిద్యాలయాలు ఇప్పుడు పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు తమ వర్సిటీల్లోకి నో ఎంట్రీ అని చెబుతున్నాయి. ముఖ్యంగా.. ఈ దేశాలకు చెందిన విద్యార్థులు నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ పత్రాలతో వస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. ఇంగ్లిష్ అర్హత పరీక్షలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించామని చెబుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన 18% మంది, బంగ్లాదేశ్‌కు చెందిన 22% మంది విద్యార్థుల వీసాలను తిరస్కరించినట్లు ప్రకటించాయి.
విద్యార్థులకు ఎలాంటి నష్టం?
నిజానికి యూకేలో చదువుకున్న విద్యార్థులకు ఆ స్థాయిలో ఉద్యోగాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో లభించడం తక్కువే. ఈ కారణంగా విద్యార్థులు స్టూడెంట్ వీసాపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లి.. అక్కడే సెటిలవ్వడం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలతో ఇప్పటికే అక్రమ వలసదారులను గుర్తించి, వెనక్కి పంపుతున్నారు. యూకే కూడా ఇప్పుడు అదే బాటలో ఉండడంతో.. పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు విదేశీ విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదముంది.



