పహోన్ పెన్: కంబోడియా- థాయ్‌లాండ్ మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్నాయి. తాజా ఘర్షణల్లో ఒక థాయ్ సైనికుడు మృతిచెందగా, నలుగురు గాయపడినట్లు థాయ్‌లాండ్ సైన్యం ప్రకటించింది. ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌లో థాయ్ దళాలపై కంబోడియా దళాలు కాల్పులు జరిపిన తరువాత థాయ్ సైనికులు ఆయుధాలతో దాడి చేశారని థాయ్ ఆర్మీ ప్రతినిధి వింథాయ్ సువారీ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో థాయిలాండ్.. కంబోడియా సరిహద్దు వెంబడి వైమానిక దాడులను కూడా ప్రారంభించింది.
ఈ ఘర్షణలకు సంబంధించి ఇరుపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే థాయ్ దళాలు కంబోడియా దళాలపై దాడి చేశాయని, కంబోడియా ప్రతీకారం తీర్చుకోలేదని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాలీ సోచెటా పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రీహ్ విహార్, ఒడ్డార్ మీన్చే సరిహద్దు ప్రావిన్సులలో ఈ దాడులు జరిగాయని ఆమె తెలిపారు.
గత జూలైలో ఇరు దేశాల మధ్య ఐదు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. దీనిలో 43 మంది మృతిచెందారు. సుమారు మూడు లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లవలసి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంల మధ్యవర్తిత్వంతో ఈ దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. అయితే అది తాజా ఘటనతో ఉల్లంఘనకు గురైనట్లు స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్యనున్న ప్రాచీన ఆలయాలు, వాటి చుట్టూ ఉన్న భూముల యాజమాన్యంపై దశాబ్దాలుగా నెలకొన్న వివాదాల కారణంగా ఈ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ సరిహద్దు ఉద్రిక్తతలు మరోమారు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో, ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: 600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు మృతి!


