భారత్ నుంచి మనుషుల అక్రమ రవాణా
న్యూయార్క్: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్‌కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. పిట్స్‌బర్గ్‌కు చెందిన స్టేసీ టేలర్(42)కు అంతర్జాతీయ దొంగరవాణా ముఠాతో సంబంధాలున్నట్లు అక్టోబర్‌లో అధికారులు ఆరోపణలు చేశారు. ఈ వారంలో అల్బనీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది.
శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని క్విబెక్, అమెరికాలోని చురుబుస్కో సమీపంలో ఈ ఏడాది జనవరిలో అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు స్టేసీ టేలర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ వాహనంలో నలుగురు విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని బోర్డర్ పెట్రోల్ విభాగం ఆరోపించింది.
నలుగురిలో ముగ్గురు భారత జాతీయులుగా కాగా, ఒకరు కెనడా వాసి అని వీరిని కెనడా నుంచి అమెరికాలోకి దొంగచాటుగా తీసుకువచ్చారని పేర్కొంది. స్టేసీ టేలర్ సెల్‌ఫోన్‌ను క్షుణ్నంగా పరిశీలించగా అందులో..అంతకుముందు కూడా ఆమె ఇలా పలుమార్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపే టెక్ట్స్ మెసేజీలున్నాయని వివరించింది. ఇతరులతో కలిపి ఆమె స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే స్టేసీకి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.


