న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న అల్బనీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థి ఉడుముల సహజారెడ్డి (24) మృతిచెందగా ఆ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్వేష్ సారపెల్లి అనే తెలుగు విద్యార్థి సైతం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం శనివారం సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించింది. మృతుని కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయంలో వీలైనంత సాయం చేస్తున్నామని తెలిపింది.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు సహజారెడ్డి, అన్వేష్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అల్బనీలోని క్వెయిల్ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ నెల 4న వారి ఇంటికి ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే సహజారెడ్డి 90 శాతం కాలిన గాయాలకు గురవగా అన్వేష్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పోలీసులు వారిని అల్బనీ మెడికల్ కేర్ సెంటర్ ఆస్పత్రికి... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వెస్ట్‌చెస్టర్ మెడికల్ బర్న్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సహజారెడ్డి శుక్రవారం మృతి చెందగా అన్వేష్ శనివారం మరణించాడు.


