రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రబ్ టైఫస్ (Scrub typhus )విజృంభిస్తోంది. అతి సులభ చికిత్స గల వ్యాధి గనుక భయాందోళనలు లేవు గానీ వ్యాప్తి మాత్రం ఎక్కువగానే ఉందని అర్థమవుతున్నది. ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యశాస్త్ర పరిభాషలో ‘ఓరియంటా సుట్స్ గమిషి’ అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం వ్యాపించి ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో వ్యాధిగ్రస్థులు బయటపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ స్క్రబ్ టైఫస్ కారక బ్యాక్టీరియా ప్రత్యక్షంగా మన శరీరంలోకి ప్రవే శించలేదు. బ్యాక్టీరియాను కలిగి వాహకాలుగా పేర్కొనే ఈగలు, పేలు, నల్లులు, చిగ్గర్లు కుట్టడం ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని రోజులలోనే ఎండిపోతుంది. దీనినే ‘ఎస్కార్’గా పేర్కొంటారు. కుట్టిన ప్రదేశం నుండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశించి శరీరమంతా వ్యాపిస్తుంది. ఆరు లేదా ఏడు రోజుల తర్వాత వ్యాధి లక్ష ణాలు బయట పడటం మొదలవు తుంది. తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, చలితో లక్షణాలు మొదలవుతాయి. కండ రాల నొప్పులు ఉంటాయి. లింఫు గ్రంథుల వాపు ఉంటుంది. 50%మందిలో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. కొందరిలో కళ్ళు ఎర్రబడవచ్చు. దగ్గు ఉండవచ్చు. నీరసం ఉంటుంది. పిల్లలలో, 60 సంవత్సరాలు దాటిన వృద్ధు లలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వయసు వారిలోనైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం పడుతుంది.
ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య
స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు ఎస్కార్ మచ్చలు, రక్త పరీక్షలలో ఎలీసా, ఇమినో ఫ్లోరోసెంట్ ఎస్సే(ఐ.ఎఫ్.ఎ.), పి.సి.ఆర్. వంటి మాలిక్యులర్‌పరీక్షలు ఉపయోగపడతాయి. వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు లున్నాయి. తొలి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చు. చికిత్స ప్రారంభించిన 24 నుండి 48 గంటలలోనే లక్షణాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు కనుక భయపడవలసిన అవసరం లేదు. కానీ వ్యాప్తిని నియంత్రించి వ్యక్తుల ఆరోగ్య, ఆర్థిక నష్టాలను అరికట్ట వలసిన అవసరం ఎంతైనా ఉంది.
– డా.టి. సేవకుమార్ , వైద్య నిపుణులు, గుంటూరు


