తాడేపల్లి, సాక్షి: దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు. ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?. తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్‌తోనే రావాలి. సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్‌ల్లోనూ పరీక్షలో నెగ్గాలి. ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు..
అలా మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం. పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది..
అలాంటప్పుడు టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?. ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? మరి తక్కువ ధరకు కొన్నారు కాబట్టి కల్తీ నెయ్యే అనుకోవాలా?.
లడ్డూ ప్రసాదంలో దుష్ప్రచారాలు ఆపాలని.. నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిందే వైవీ సుబ్బారెడ్డి. ఆయన అపర భక్తుడు. నిత్యం గోపూజలు చేస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసి గురుస్వామి అయ్యారు. అలాంటి వ్యక్తిని ఈ కేసుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పన్న సుబ్బారెడ్డి పీఏ అంటూ ప్రచారం చేశారు. ఆయన అప్పన్న అసలు ఎవరు?. ఏపీ భవన్ ఉద్యోగి. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి పీఏ. అధికార పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఎల్లో మీడియా ఎందుకు వైవీ సుబ్బారెడ్డి పీఏగా బోగస్ ప్రచారం చేస్తున్నాయి?.
చంద్రబాబు లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌లో ఏర్పాటు చేసిన అధికారులంతా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే. టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే. బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా కీలకంగా ఉన్నవాళ్లే.
పరకామణి కేసులో..
పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?. పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు. జీయర్ స్వామి మఠంలో క్లర్క్‌గా పని చేశాడు. ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి. దొంగను మేం పట్టుకున్నాం. మీరెందుకు పట్టుకోలేదు. ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి. అంతా పద్దతి ప్రకారమే జరిగింది. నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు.
పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు. కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు. దొంగను పట్టుకోవడం నేరమా?.. ఒక బీసీ పోలీస్ అధికారిని వెంటాడి.. వేధించి.. చనిపోయేలా చేశారు. ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.. అని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీన రమణ, సురేష్ అనే ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు. వీళ్లిద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు?. విచారణ జరిపి పరకామణి కేసులా ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి. మరి ఆయన్ని విచారించారా?. వైవీ సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?.. అని ప్రశ్నించారు. దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని టీటీడీలో రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం. పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇది ధర్మమేనా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.


