సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సాధారణంగా మద్యం దుకాణాలు ఊళ్లలోనే ఉంటాయి. అక్కడ మాత్రం ఊరి అవతల ఉండాలి. అంతేకాదు అక్కడ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తెరవాలి. పర్మిట్ రూమ్‌లోకి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే అనుమతించాలి. ఊళ్లో బెల్ట్ షాపులు ఉండటానికి వీల్లేదు. ఇది నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రత్యేక విధానం. ఇందుకోసం ఆయన వైన్స్ షాపుల యజమానులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఒప్పించారు.
ప్రజల ఆరోగ్యం పాడు చేసుకోవద్దనే..
మునుగోడులో 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు రాజగోపాల్‌రెడ్డికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇంట్లో మగాళ్లు పనులకు వెళ్లకుండా తాగుతున్నారని, ప్రతి గ్రామంలో ఆరేడు బెల్ట్ షాపులు ఉండటంతో ఉదయం 5 గంటల నుంచే తాగుతున్నారని వాపోయారు. యువత కూడా చాలా మంది పొద్దంతా తాగుతూ తమ భవిష్యత్‌ను, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని, గొడవలు అవుతున్నాయని మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. వైన్స్ యజమానులను ఒప్పించి బెల్ట్ షాపులను బంద్ చేయించారు. వారికి మద్యం అమ్మకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా చాటుగా అమ్మితే కేసులు నమోదు చేసేలా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో బెల్ట్ షాపులు కట్టడి అయ్యాయి. ఇక ఇప్పుడు వైన్స్ షాపులు ఊళ్లో లేకుండా, ఊరి బయటే ఉండేలా చర్యలు చేపట్టారు. మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో విజయవంతంగా అమలు చేశారు. మునుగోడుకు కేటాయించిన నాలుగు షాపుల్లో నల్లగొండ రోడ్డులో ఒకటి, చండూరు రోడ్డులో మరొకటి, చౌటుప్పల్ రోడ్డులో ఒక్కటి, గ్రామ శివారులో మరొకటి ఏర్పాటు చేశారు.
ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా
బెల్ట్ షాపులు లేకుండా చేయడం, మద్యం దుకాణాల వేళలను పరిమితం చేయడం వల్ల ప్రజలు మద్యానికి బానిక కాకుండా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. ఈ కట్టడి వల్ల ఉదయం తాగేవారు తగ్గిపోతారు. యువత బానిస కాకుండా ఉంటారు. భవిష్యత్‌లో మద్యం షాపులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు చేసే ఆలోచన ఉంది. ఈ సమయపాలనను రాష్ట్ర పాలసీగా చేసేలా ప్రయత్నిస్తా.
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


