రూ.కోట్లు ఉన్నాయి.. సర్పంచ్‌ పదవి ఇవ్వండి.. | Telangana Local Body Elections 2025 | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు ఉన్నాయి.. సర్పంచ్‌ పదవి ఇవ్వండి..

Dec 4 2025 12:35 PM | Updated on Dec 4 2025 12:48 PM

 Telangana Local Body Elections 2025

ఖమ్మం జిల్లా: ‘డబ్బు ఎన్నికోట్లయినా ఖర్చుపెడదాం.. ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్‌ పదవి ఇవ్వండి.. నాకు రాష్ట్ర స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నా యి.. గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా.. కాదని ఎవరైనా పోటీకి దిగితే మా ముందు తట్టుకోలేరు’ అంటూ ప్రగల్భాలు పలికిన ఓ వ్యక్తి పోలీసుల వేట ముమ్మరం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కల్లూరు మండలంలో ఎర్రబోయినపల్లి పంచాయతీ సర్పంచ్‌ పదవి జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయింది. దీంతో అదే గ్రామానికి చెందిన పోట్రు ప్రవీణ్‌ సర్పంచ్‌ పదవి ఆశించగా.. ఆయనతో పోటీ పడటానికి అధికార పార్టీలో ఎవరూ ఆసక్తి చూపించలేదు. ధనబలం, కండబలం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన సర్పంచ్‌ కావడం ఖాయమని వారం క్రితం వరకు అంతా భావించారు. అంతేకాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి స్థానం జనరల్‌ అయితే బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి సిద్ధమేనని చెప్పుకున్న ప్రవీణ్‌ సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు బయటపడడం కల్లూరు మండలంలో సంచలనంగా మారింది. 

ఎస్‌ఓటీ పోలీసుల విచారణతో..
కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాశ్‌ వరుసకు అన్నదమ్ములు. హైదరాబాద్‌ హైటెక్‌సిటీ కేంద్రంగా ఆస్ట్రేలియా దేశ పౌరులను మోసగించేందుకు రిట్జ్‌ ఐటీ సొల్యూషన్‌ పేరుతో 2024లో నకిలీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఓటీ పోలీసులు ఇటీవల గుర్తించారు. ప్రధాన నిందితులైన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్‌ కల్లూరు మండలం లింగాలకు చెందిన ఏపూరి గణేష్, వేంసూరు మండలం లింగపాలెంకు చెందిన మోరంపూడి చెన్నకేశవను సెంటర్‌లో విధులకు నియమించినట్లు తేల్చారు. ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్‌ ఐడీలు, ఫోన్‌నంబర్లు సేకరించి తన వద్ద పని చేసే వారితో ‘మీ కంప్యూటర్‌ హ్యాక్‌ అయింది.. దీన్ని పరిష్కరించాలంటే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించండి’ అంటూ ఆస్ట్రేలియా యాసలో మాట్లాడేలా ఇంకొందరిని నియమించుకుని ఫోన్‌ చేయించినట్లు బయటపడింది. ఆపై వారి ఖాతాల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కీలకమైన ల్యాప్‌టాప్‌
గత శనివారం ఎర్రబోయినపల్లికి వచ్చిన హైదరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు.. పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్‌ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్‌ ఇంట్లో కీలక ఆధారాలు ఉన్న ల్యాబ్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక పోట్రు ప్రవీణ్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. కాగా, స్వగ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకునే ఆయన సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు తెలియడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సైబర్‌ నేరాలతో పాటు హవాలా, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసి సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, కల్లూరు, ఎర్రబోయినపల్లిలో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రవీణ్‌ తనకు ఆంధ్రాలో టీడీపీ.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో సంబంధాలు ఉన్నట్టు వారి ఫొటోలతో సోషల్‌ మీడియా, ఫ్లెక్సీలతో హోరెత్తిస్తుంటాడు. రెండేళ్ల నుంచి కల్లూరు, తల్లాడ మండలాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఫ్లెక్సీలు, మోటారు సైకిల్‌ ర్యాలీతో హోరెత్తిస్తున్న ఆయనపై గతంలోనూ కేసులు నమోదైతే కొందరు నేతల సహకారంతో బయటపడినట్లు సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement