కథలాపూర్(వేములవాడ): పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో క్షణక్షణం ఉత్కంఠ. ఓటర్లు ఒక్కరోజులోనే ఎవరివైపు ప్రచారం చేస్తారో.. ఎటూ మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితులుంటాయి. అభ్యర్థులు మద్దతుదారుల మెప్పుపొందుతూనే కొత్తవారిని కూడగట్టుకోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఇలా ఒకటి, రెండు ఓట్ల తేడాతో జయపజయాలు పొందిన వారున్నారు. ఇలా 2013లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మండలంలోని పెగ్గెర్లలో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలుపోటములు పొందారు. పెగ్గెర్లలో అప్పట్లో 967 మంది ఓటర్లున్నారు. 2013లో సర్పంచ్ ఎన్నికల్లో కనగందుల దేవక్కకు 432 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి మోత్కురి గంగుకు 431 ఓట్లు వచ్చాయి. దీంతో రీకౌంటింగ్‌కు అభ్యర్థులు పట్టుబట్టారు. అధికారులు రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటు తేడాతో దేవక్కనే విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. అందులోనూ ఒకేఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు తీర్పును మార్చేసింది.
రిజర్వేషన్ ఏదైనా.. ఆ కుటుంబానిదే విజయం
మల్యాల: ఆయనది సాధారణ కుటుంబం. ఒగ్గు కథకుడిగా ప్రజలకు సుపరిచితుడు. ఆయన మంచితనమే ఆయనతోపాటు ఆయన కుటుంబానికి 30ఏళ్లుగా పంచాయతీ పగ్గాలు అప్పగిస్తోంది. రిజర్వేషన్ ఏదైనా.. ఆయన కుటుంబానికే ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. మల్యాల మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన మోత్కు కొమురయ్య ఒగ్గుకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. దేవమ్మ, యాదమ్మ. నిజాయితీ, నిబద్ధతగల వ్యక్తి కావడంతో 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొమురయ్య విజయం సాధించాడు. 2005 వరకు సర్పంచ్‌గా కొనసాగాడు. మొదటి భార్య దేవమ్మ ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం కొమురయ్య మరోసారి సర్పంచ్‌గా విజయం సాధించారు. రెండో భార్య యాదమ్మ ఐదేళ్లు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. కొమురయ్య మొదటిసారి బరిలో నిలిచినప్పుడు రిజర్వేషన్ బీసీ జనరల్, రెండోసారి జనరల్, మూడోసారి బీసీ మహిళ, నాలుగోసారి బీసీ జనరల్, ఐదోసారి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఆరోసారి కూడా రిజర్వేషన్ జనరల్ కావడంతో కొమురయ్య సర్పంచ్ బరిలో నిలుస్తున్నాడు.
రిజర్వేషన్ ఏదైనా పోటీ చేసేది ఎస్సీలే..
ఉప్పట్ల పంచాయతీ విచిత్రం
మంథనిరూరల్: సాధారణంగా ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు అనుకూలంగా అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు జనరల్ కేటగిరీ ఉంటుంది. కానీ అక్కడ రిజర్వేషన్లకు భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల అది. ఆ గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ, ఓసీల నుంచి ఒక్కనామినేషన్ కడా దాఖలు కాలేదు. అందరూ ఎస్సీలే నామినేషన్‌లు వేశారు. అలాగే ఎనిమిది వార్డుల్లో నాలుగు ఎస్సీ, నాలుగు జనరల్ కాగా వాటిలో సైతం ఎస్సీలే నామినేషన్‌లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం 1,161 మంది ఓటర్లు ఉండగా ఎస్సీలదే మెజారిటీ. అయినా, ఓసీలు, బీసీలు కలిస్తే ఎస్సీలకన్నా ఎక్కువగా ఉంటారు. కానీ, ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, వెంటనే నామినేషన్‌ల స్వీకరణ జరుగడంతో గడువు లేక నామినేషన్‌లు దాఖలు చేయలేకపోయామని పలువురు ఆశావహులు తెలిపారు. అంతేకాకుండా జనరల్ మహిళగా రిజర్వేషన్ రావడంతో ఓసీ, బీసీల్లోమహిళలు ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఏదిఏమైనా జనరల్ స్థానంలోసైతం ఎస్సీలకు అవకాశం రావడం ఇదే ప్రథమం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


