సిద్దిపేట జిల్లా (గజ్వేల్): ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18) ఇంటర్మీడియెట్ చదివి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళుతోంది. ఇదిలా ఉండగా శంకర్ కుటుంబీకుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేశ్ అలియాస్ రహీం బాబా వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో శ్రావణికి మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ఒకరినొకరు ఇష్టపడే స్థాయికి చేరింది.
కాగా, నవంబర్ 30న మహేశ్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రావణి మానసికంగా కుంగిపోవడాన్ని గమనించిన తండ్రి శంకర్ ఆరా తీయగా మహేశ్‌ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో శ్రావణి బుధవారం ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆమె తమ్ముడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వెంటనే ఇంటికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. ఈ ఘటనపై శ్రావణి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


