breaking news
Saidapet
-
ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో..
సిద్దిపేట జిల్లా (గజ్వేల్): ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18) ఇంటర్మీడియెట్ చదివి ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళుతోంది. ఇదిలా ఉండగా శంకర్ కుటుంబీకుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేశ్ అలియాస్ రహీం బాబా వద్దకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో శ్రావణికి మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ఒకరినొకరు ఇష్టపడే స్థాయికి చేరింది. కాగా, నవంబర్ 30న మహేశ్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి శ్రావణి మానసికంగా కుంగిపోవడాన్ని గమనించిన తండ్రి శంకర్ ఆరా తీయగా మహేశ్‌ను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పింది. ఈ క్రమంలో శ్రావణి బుధవారం ఇంట్లో పెద్దవాళ్లు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. ఇది గమనించిన ఆమె తమ్ముడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె వెంటనే ఇంటికి చేరుకొని తలుపులు బలవంతంగా తెరిచి చూసింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రావణిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. ఈ ఘటనపై శ్రావణి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రోడ్డెక్కిన న్యాయవాదులు
రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు తమిళంలోనే సాగాలంటూ న్యాయవాదు లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. దీంతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, వాదోపవాదాలు అన్నీ తమిళంలోనే సాగాలని న్యాయవాదులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సైతం వారి విన్నపాన్ని మన్నించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తీర్మానం జరిగి ఏళ్లు గడుస్తున్నా తమిళం మాత్రం అమలులోకి రాలేదు. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల ముందు న్యాయవాదులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కక్షిదారులకు అవస్థలు మద్రాసు హైకోర్టు, సెషన్స్ కోర్టు, సైదాపేట, జార్జ్‌టౌన్, ఎగ్మూరు, మదురై ధర్మాసనం తదితర ప్రాంతాల్లో న్యాయవాదులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. న్యాయస్థానాల్లో తక్షణం తమిళాన్ని అమలు చేయూలని నినాదాలు హోరెత్తించారు. మదురైకి చెందిన 500 మంది న్యాయవాదులు ద్విచక్రవాహనాల్లో చెన్నైకి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. తమిళ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్కృష్ణన్, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్న, లా అసోసియేషన్ అధ్యక్షులు విజయరాఘవన్, తమిళనాడు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ప్రభాకరన్ ఆందోళనలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్ ఆందోళన శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ ఆందోళన కారణంగా న్యాయస్థానాల్లో కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఆందోళన సమాచారం తెలియకుండా న్యాయస్థానాలకు చేరుకున్న కక్షిదారులు ఇబ్బందులు పడ్డారు.


