రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు తమిళంలోనే సాగాలంటూ న్యాయవాదు లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. దీంతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డెక్కిన న్యాయవాదులు
Sep 7 2013 3:37 AM | Updated on Sep 1 2017 10:30 PM
రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో కార్యకలాపాలు తమిళంలోనే సాగాలంటూ న్యాయవాదు లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. దీంతో న్యాయస్థానాల్లో కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: న్యాయస్థానాల్లో కార్యకలాపాలు, వాదోపవాదాలు అన్నీ తమిళంలోనే సాగాలని న్యాయవాదులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సైతం వారి విన్నపాన్ని మన్నించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తీర్మానం జరిగి ఏళ్లు గడుస్తున్నా తమిళం మాత్రం అమలులోకి రాలేదు. అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు న్యాయవాదులు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల ముందు న్యాయవాదులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
కక్షిదారులకు అవస్థలు
మద్రాసు హైకోర్టు, సెషన్స్ కోర్టు, సైదాపేట, జార్జ్‌టౌన్, ఎగ్మూరు, మదురై ధర్మాసనం తదితర ప్రాంతాల్లో న్యాయవాదులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. న్యాయస్థానాల్లో తక్షణం తమిళాన్ని అమలు చేయూలని నినాదాలు హోరెత్తించారు. మదురైకి చెందిన 500 మంది న్యాయవాదులు ద్విచక్రవాహనాల్లో చెన్నైకి చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు.
తమిళ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్‌కృష్ణన్, మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్న, లా అసోసియేషన్ అధ్యక్షులు విజయరాఘవన్, తమిళనాడు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ప్రభాకరన్ ఆందోళనలో పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పాండియన్ ఆందోళన శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ ఆందోళన కారణంగా న్యాయస్థానాల్లో కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఆందోళన సమాచారం తెలియకుండా న్యాయస్థానాలకు చేరుకున్న కక్షిదారులు ఇబ్బందులు పడ్డారు.
Advertisement
Advertisement


