కోతుల పేరుతో ప్రచారాలు ఇంట్లోనే పంచాయతీలు | Campaigning for Panchayat elections in villages | Sakshi
Sakshi News home page

కోతుల పేరుతో ప్రచారాలు ఇంట్లోనే పంచాయతీలు

Dec 4 2025 4:41 AM | Updated on Dec 4 2025 4:41 AM

Campaigning for Panchayat elections in villages

ఏ గ్రామంలో చూసినా కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీనినే కొందరు సర్పంచ్‌ అభ్యర్థులు తమ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు. తమను గెలిపిస్తే.. కోతులు లేని గ్రామాలను తయారు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు.

చింపాంజీ, ఎలుగుబంటి వేషంతో ప్రచారం
కమలాపూర్‌: హనుమకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు కృషి చేస్తామంటూ సర్పంచ్‌ అభ్యర్థులు జెట్టి నాగలక్ష్మి, గోల్కొండ శ్రీరాం అనుచరులు చింపాంజీ, ఎలుగు బంటి వేషధారణ వేసి గ్రామంలో వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కోతులను వెంబడించి వాటిని ఊరి బయటకు తరుముతున్నారు.

కొండముచ్చుతో ప్రచారం 
దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్‌ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్‌ బుధవారం కొండముచ్చుతో ప్రచారం చేశాడు. గ్రామంలో దానిని తిప్పుతూ కోతుల బెడద తీర్చేందుకు కొండముచ్చును తీసుకొచ్చానని, ఓటు తనకే వేయాలని కోరాడు. గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కోతులను తరిమేస్తానని హామీ ఇచ్చాడు.

స్వామి కాలు రాతలో అభ్యర్థుల భవిత 
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలో ధారావత్‌తండా, ధర్మగడ్డతండాలు ఉన్నాయి. ఈ రెండు తండాల నుంచి సర్పంచ్, వార్డు బరిలో నిలిచేందుకు పలువురు సిద్ధమయ్యారు. వీరిలో కొందరి నామినేషన్‌ పత్రాలను «ధారావత్‌తండాకు చెందిన ధారావత్‌ స్వామి కాలుతో రాశారు. తలరాత చేతిరాతతో కాకుండా.. మా గిరిజన బిడ్డ కాలురాత మాకు కలిసొస్తుందని పలువురు కితాబు ఇచ్చారు.

నామినేషన్‌ పత్రాలు చోరీ
తాండూరు రూరల్‌: క్లస్టర్‌ సెంట ర్‌లో భద్రపర్చిన నామినేషన్‌ పత్రా లను దుండగులు ఎత్తుకె ళ్లారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం గొట్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్ని కల్లో భాగంగా హన్మాపూర్, గొట్ల పల్లి, గిర్మాపూర్, జైరాంతండా(ఐ) జీపీలకు సంబంధించిన నామినేషన్లను గొట్లపల్లిలో స్వీకరించారు. ఆయా గ్రామాల నుంచి 20 మంది సర్పంచ్‌గా, 68మంది వార్డు సభ్యుల పదవుల కోసం నామినేషన్లు వేశారు. 

ఈ పత్రాలను గదిలో భద్రపర్చిన రిటర్నింగ్‌ అధికారి అంజయ్య మంగళవారం సాయంత్రం తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 10 గంటలకు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా, గొట్లపల్లి గ్రామానికి సంబంధించిన నామినేషన్‌ పత్రాలు కనిపించలేదు. 

మిగిలిన నామినేషన్లన్నీ అలాగే ఉన్నాయి. విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ ఘటనా స్థలానికి వెళ్లి, విచారణ ప్రారంభించారు. నామినేషన్లకు సంబంధించిన పూర్తి డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.

కేసీఆర్‌ దత్తత గ్రామాల్లో ఏకగ్రీవాలు 
మర్కూక్‌(గజ్వేల్‌): మాజీ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామాలైన ఎరవ్రల్లి, నరసన్నపేటలో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎర్రవల్లిలో నారన్న గారి కవిత రామ్మోహన్‌రెడ్డిని, నరసన్నపేటలో గిలుక బాల్‌ నర్సయ్యను సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎరవ్రల్లిలో 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నరసన్నపేటలోనూ నాలుగు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పోటీకి ఒక్కరూ లేరు
పేరూర్‌లో సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలుకాని నామినేషన్లు 
హాలియా: నల్లగొండ జిల్లా హాలియా మండలం పేరూర్‌ గ్రామ సర్పంచ్‌ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే ఆ సామాజికవర్గానికి చెందిన మహిళా ఓటరు ఒక్కరు కూడా లేరు. 8 వార్డులుండగా, 4 ఎస్టీలకు, 4 బీసీలకు రిజర్వు అయ్యాయి. వార్డుల్లోనూ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. రిజర్వేషన్‌ ప్రక్రియలో తమ గ్రామానికి తీరని అన్యాయం జరిగిందని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

సర్పంచ్‌ బరిలో తండ్రీకొడుకు
రామాయంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌ సర్పంచ్‌ స్థానానికి తండ్రీకొడుకు నామినేషన్లు వేశారు. మాజీ సర్పంచ్‌ మానెగల్ల రామకిష్టయ్య ఆయుర్వేద వైద్యుడిగా సుపరిచితుడు. సర్పంచ్‌ పదవి జనరల్‌కు రిజర్వ్‌ కాగా, పది మంది నామినేషన్లు వేశారు. వీరిలో రామకిష్టయ్యతోపాటు ఆయన కుమారుడు వెంకటేశ్‌ కూడా ఉన్నారు.

అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరు..
వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు పంచాయతీలో సర్పంచ్‌ స్థానానికి అన్నదమ్ములే ప్రత్యర్థులుగా నిలిచారు. తడికమళ్ల నాగేశ్వరరావు 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచాడు. 2019లో బీఆర్‌ ఎస్‌ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచాడు. అయితే అన్న నాగార్జున, నాగేశ్వరరావుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. దీంతో తమ్ముడిపై తాను పోటీకి సై అంటూ నాగార్జున బరిలోకి దిగాడు.  

అక్కాచెల్లి మధ్యనే పోటీ 
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానానికి కాంగ్రెస్‌ మద్దతుతో చిట్టూరి రంగమ్మ నామినేషన్‌ వేశారు. అదే గ్రామానికి చెందిన ఆమె చెల్లి మల్లెంపూడి కృష్ణకుమారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఒకే ఇంట్లో ముగ్గురు..
పాల్వంచరూరల్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తవిశలగూడెంలో గ్రామంలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. తవిశలగూడెం సర్పంచ్‌గా కాలం జయ నామినేషన్‌ వేశారు. ఆమె భర్త కాలం సురేశ్, ఆతయన తల్లి సత్తెమ్మ వార్డు సభ్యులుగా బరిలో ఉన్నారు. అదే పంచాయ తీలో దంపతులు కోరం ఎర్రయ్య, ఎర్రమ్మ కూడా వార్డు సభ్యులుగా పోటీలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement