సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జారీచేసిన జీవోలపై స్టేను హైకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీవో 9, 41, 42పై నిలిపివేత ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ప్రతివాదు లను ఆదేశించింది. అప్పటి నుంచి మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు చెబుతూ.. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవా పూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవ రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. తమ వాదనలూ వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు 28 మంది ఇంప్లీడయ్యారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో సమ్మతించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.


