తెలంగాణ ప్రత్యక్ష పన్నుల చెల్లింపు భారీగా పెరుగుదల
కేంద్రానికి 2022–23లో రూ.35 వేల కోట్లు.. 2023–24లో రూ.84 వేల కోట్లు
2024–25లో రూ.97 వేల కోట్లకు పెరిగిన చెల్లింపులు
కేంద్రం వెల్లడించిన గణాంకాలపై ఆర్థిక నిపుణుల విస్మయం
సాక్షి, హైదరాబాద్: 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వెళ్లింది రూ.35,433 కోట్లు. మరుసటి ఏడాది అంటే 2023–24లో ప్రత్యక్ష పన్నుల కింద రాష్ట్రం చెల్లించింది రూ.84,439 కోట్లు. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.50 వేల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు పెరిగాయన్న మాట. ఆ తర్వాతి సంవత్సరంలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. 2024–25లో ఏకంగా రూ.97 వేల కోట్లకు పైగానే తెలంగాణ చెల్లించింది.
2022–23లో రూ.35 వేల కోట్లున్న ప్రత్యక్ష పన్నులు రెండేళ్ల తర్వాత అంటే 2024–25 నాటికి దాదాపు రూ.లక్ష కోట్లకు చేరడం గమనార్హం. కాగా ఈ గణాంకాలను పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఇలా రెండేళ్లలో దాదాపు మూడు రెట్ల వరకు ప్రత్యక్ష పన్నులు పెరగడం ఆర్థిక రంగ నిపుణులను కూడా విస్మయపరుస్తోంది. ఎలాంటి ప్రత్యేక పరిస్థితులు లేకుండానే ఇంత పెద్ద మొత్తంలో ప్రత్యక్ష పన్నులు పెరగడం వెనుక కారణాలేంటన్న దానిపై వారు ఆరా తీస్తున్నారు.
ప్రజల్లో పెరిగిన అవగాహన
దేశంలో అనేక రకాల ప్రత్యక్ష పన్నులున్నాయి. వీటిల్లో వ్యక్తులు, సంస్థలు, హెచ్‌యూఎఫ్‌ల ఆదాయంపై చెల్లించే ఆదాయపు పన్ను, స్వదేశీ, విదేశీ కంపెనీల లాభాలపై విధించే కార్పొరేట్ పన్ను, స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక కేటగిరీలుగా విభజించిన మూలధన ఆస్తుల అమ్మకాల ద్వారా గడించిన లాభాలపై విధించే క్యాపిటల్ గెయిన్ పన్ను, లిస్టెడ్ సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లపై విధించే సెక్యూరిటీ లావాదేవీల పన్ను, కుటుంబేతరులకు రూ.50 వేల కంటే ఎక్కువ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కట్టే గిఫ్ట్ ట్యాక్స్, ఉద్యోగులు, వ్యక్తులు చెల్లించే ప్రొఫెషనల్ ట్యాక్స్‌లు ప్రధానమైనవి. కాగా ప్రజల్లో పెరిగిన అవగాహన పెరగడంతో ఆదాయపు పన్ను పెరిగి ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు.
కార్పొరేట్ పన్నుల్లో అసాధారణ పెరుగుదల
మ్యూచువల్ ఫండ్స్, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చే లాభా లపై చెల్లించే పన్ను, పెద్ద పెద్ద కంపెనీల లాభాల్లో భారీ పెరుగుదల నమోదు కావడం ద్వారా వచ్చే కార్పొరేట్ పన్ను ల్లో కూడా అసాధారణ పెరుగుదల నమోదై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని పూర్తి స్థా ్డయిలో నిర్ధారించలేమని, ఆయా శాఖలు వెల్లడించే అధి కారిక గణాంకాల ద్వారానే దీనిపై స్పష్టత వస్తుందని ‘సాక్షి’ తో మాట్లాడిన కొందరు ఆర్థిక నిపుణులు వెల్లడించారు.
కట్టింది ఎక్కువ.. వచ్చింది తక్కువ
పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత ఆరేళ్ల కాలంలో ప్రత్యక్ష పన్నులు, సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీల రూపంలో కేంద్రానికి తెలంగాణ నుంచి రూ.4.35 లక్షల కోట్లు రాగా.. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద రూ.3.17 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.
కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన దాంట్లో.. కేంద్ర పన్నుల్లో వాటా (రూ.1.17 లక్షల కోట్లు), వివిధ కేంద్ర పథకాల ద్వారా (రూ.1.22లక్షల కోట్లు) వచ్చినవి ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) కోసం 2019–20 నుంచి 2024–25 వరకు రూ.81 వేల కోట్లకు పైగా వచ్చాయి.


