త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్‌ ప్రకటన | CM Revanth Reddy announcement of 40 Thousand of Jobs in Husnabad | Sakshi
Sakshi News home page

త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్‌ ప్రకటన

Dec 4 2025 1:08 AM | Updated on Dec 4 2025 1:08 AM

CM Revanth Reddy announcement of 40 Thousand of Jobs in Husnabad

గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కావాలంటూ ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి

హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన

కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలున్నా కొట్లాడి నిధులు తెస్తాం 

గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటా.. 

పదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం 

యువత పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి ఏకమవ్వాలి 

ప్రజలను ఒప్పించి మంచోడిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకోవాలి 

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్లు ఏమైనా పాలించారా? 

నాడు హుస్నాబాద్‌ను ఎందుకు పట్టించుకోలేదు? 

రూ.లక్ష కోట్లు పెడితే కాళేశ్వరం...కూలేశ్వరమైందని ధ్వజం 

హుస్నాబాద్‌లో ప్రజాపాలన– ప్రజావిజయోత్సవాలు

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శ్రీకాంతాచారి స్ఫూర్తితో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మరో ఆరు నెలల్లో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. 

ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ హుస్నాబాద్‌ నుంచే బహుజన దండు కట్టారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇచ్చారు’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా  రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. 

కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్లు వృథా  
‘యువత పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకమై, వీలైనంత వరకు ప్రజలను ఒప్పించి ఏకగ్రీవమైనా చేసుకోండి.. లేదా మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో.. కాళ్లలో కట్టెలు పెట్టే వారిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావన్నారు. 

కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందని చెప్పారు. ‘పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు. చిన్న తప్పులు చేస్తే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలున్నా కొట్లాడి నిధులు తెస్తాం. గ్రామాల అభివృద్ధికి ని«ధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా’ అని చెప్పారు. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఓ మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్‌గా ఉంటే ఆ గ్రామం అలా అభివృద్ధి చెందుతున్నారు.  

కాళేశ్వరం...కూలేశ్వరమైంది 
కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ఎలా ఉందో?.. బీఆర్‌ఎస్‌ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరమైంది.. ఆనాడు ఎస్సారెస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదదు. 

ఆనాడు కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులు నిర్మించింది కాబట్టే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి చెందింది. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని చేసి చూపించింది ప్రజా ప్రభుత్వమే’ అని అన్నారు. 

మహిళలను ఓనర్లను చేశాం 
విద్య, నీటిపారుదలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయం కోసం రూ1.04 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టామని, 25 లక్షల మంది రైతులకు రూ. 21,654 కోట్లను రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ‘మహిళలకు ఫ్రీ బస్సేకాదు... మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చి ఓనర్లను చేశాం. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. పదేళ్లలో కాంగ్రెస్‌ 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

ఆ మూడు నియోజకవర్గాల్లో దేవుళ్లు పాలించారా? 
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్లు ఏమైనా పాలించారా?... హుస్నాబాద్‌ను ఎందుకు పట్టించుకోలేదు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తవుతాయి. అదే హుస్నాబాద్‌లోని గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్‌లు పూర్తికావు. కేసీఆర్‌కు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్‌గా హుస్నాబాద్‌ కావాలి.. ని«ధులు మాత్రం సున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం... త్వరలో గౌరవెల్లిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు.  

ఐటీఐలను ఏటీసీలుగా.. 
‘ఐటీఐలు కాలం చెల్లిపోయిన శిక్షణలు ఇచ్చేవి. డీజిల్‌ మెకానిక్‌ రిపేర్‌ చేసే అంబాసిడర్‌ కార్లు షెడ్డుకు పోయాయి. నేర్చుకున్న విద్యార్థులు ఫాం హౌజ్‌లో ఉన్న కారు రిపేర్‌ చేయాలి. ఇప్పుడు ఆడీ, బెంజ్‌ కార్లు వచ్చాయి. అందుకే ఐటీఐ కాలేజీలన్నింటినీ ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతీ విద్యార్థికి నెలనెలా రూ.2 వేలు ఇస్తున్నాం. నిరుద్యోగులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌ వెంకటస్వామి, శ్రీధర్‌ బాబు, లక్ష్మణ్‌ కుమార్, తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌లు పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరుకావాల్సి ఉండగా సాయంత్రం 5.30 గంటలకు సభావేదిక పైకి వచ్చారు. సీఎం ఆలస్యంగా రావడంతో కొంతమంది వెళ్లిపోయారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement