breaking news
Government job replacement
-
త్వరలో 40 వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ ప్రకటన
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శ్రీకాంతాచారి స్ఫూర్తితో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మరో ఆరు నెలల్లో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఇచ్చారు’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్లు వృథా ‘యువత పదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఏకమై, వీలైనంత వరకు ప్రజలను ఒప్పించి ఏకగ్రీవమైనా చేసుకోండి.. లేదా మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వాడిని, మంచోడిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మద్యానికి ఆశపడో.. కాళ్లలో కట్టెలు పెట్టే వారిని ఎన్నుకుంటే మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావన్నారు. కిరికిరి సర్పంచ్‌లు వస్తే ఐదేళ్ల కాలం వృథా అవుతుందని చెప్పారు. ‘పొంకనాలు కొట్టే వాడిని సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు. చిన్న తప్పులు చేస్తే అభివృద్ధి దెబ్బతింటుంది. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలున్నా కొట్లాడి నిధులు తెస్తాం. గ్రామాల అభివృద్ధికి ని«ధులు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా’ అని చెప్పారు. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ఓ మంచి వ్యక్తి గ్రామ సర్పంచ్‌గా ఉంటే ఆ గ్రామం అలా అభివృద్ధి చెందుతున్నారు. కాళేశ్వరం...కూలేశ్వరమైంది కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ ఎలా ఉందో?.. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలేశ్వరమైంది.. ఆనాడు ఎస్సారెస్పీని నెహ్రూ కడితే ఇప్పటికీ చెక్కు చెదరలేదదు. ఆనాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే దేశానికి సేవలు అందిస్తున్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, జూరాల ప్రాజెక్టులు నిర్మించింది కాబట్టే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి చెందింది. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండగ అని చేసి చూపించింది ప్రజా ప్రభుత్వమే’ అని అన్నారు. మహిళలను ఓనర్లను చేశాం విద్య, నీటిపారుదలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయం కోసం రూ1.04 లక్షల కోట్ల నిధులు ఖర్చు పెట్టామని, 25 లక్షల మంది రైతులకు రూ. 21,654 కోట్లను రుణ మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ‘మహిళలకు ఫ్రీ బస్సేకాదు... మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చి ఓనర్లను చేశాం. బీఆర్ఎస్ పదేళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. పదేళ్లలో కాంగ్రెస్ 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో దేవుళ్లు పాలించారా? గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో దేవుళ్లు ఏమైనా పాలించారా?... హుస్నాబాద్‌ను ఎందుకు పట్టించుకోలేదు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో రంగనాయకసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు పూర్తవుతాయి. అదే హుస్నాబాద్‌లోని గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్‌లు పూర్తికావు. కేసీఆర్‌కు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్‌గా హుస్నాబాద్ కావాలి.. ని«ధులు మాత్రం సున్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గత పాలకుల మాదిరిగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం... త్వరలో గౌరవెల్లిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. ఐటీఐలను ఏటీసీలుగా.. ‘ఐటీఐలు కాలం చెల్లిపోయిన శిక్షణలు ఇచ్చేవి. డీజిల్ మెకానిక్ రిపేర్ చేసే అంబాసిడర్ కార్లు షెడ్డుకు పోయాయి. నేర్చుకున్న విద్యార్థులు ఫాం హౌజ్‌లో ఉన్న కారు రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆడీ, బెంజ్ కార్లు వచ్చాయి. అందుకే ఐటీఐ కాలేజీలన్నింటినీ ఏటీసీలుగా మార్చాం. ఏటీసీలో చేరే ప్రతీ విద్యార్థికి నెలనెలా రూ.2 వేలు ఇస్తున్నాం. నిరుద్యోగులను సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దుతాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరుకావాల్సి ఉండగా సాయంత్రం 5.30 గంటలకు సభావేదిక పైకి వచ్చారు. సీఎం ఆలస్యంగా రావడంతో కొంతమంది వెళ్లిపోయారు. -
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోనివారూ ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. సాగదీతలు.. వాయిదాలతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్లో వెలువడ్డాయి. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హాజరుశాతం.. క్రమంగా పతనం.. గత ఏడాది జూలైలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. – అబ్దుల్ కరీం, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. – భవాని శంకర్ కోడాలి, నిపుణులు, కెరీర్ గైడ్ -
ఇలా భర్తీ.. అలా ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నియామక సంస్థలు అనుసరిస్తున్న విధానం గందరగోళానికి కారణ మవుతోంది. నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరా శకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను క్రమపద్ధతిలో చేపట్టకపోవడం సమస్యగా మారు తోంది. ఓవైపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో చివరి వరకు ఎదురుచూసిన వారికి చేదు అనుభవం మిగులుతుంటే.. మరోవైపు వేలకొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేర్వేరు నియామక సంస్థలు చేపట్టిన అర్హత పరీక్షల్లో కొందరు అభ్యర్థులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికవడం.. నియామక పత్రాలు స్వీకరించడం.. చివరికి వీటిలో చిన్న ఉద్యోగాలను వదులుకుని పెద్ద కేడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడమే ఈ పరిస్థితికి దారితీస్తోంది. గత ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి కారణాలతో మిగిలిపోయినట్టు అంచనా. రాష్ట్రంలో ఉద్యోగ నియామక సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియను చేపడుతుండటమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి.భర్తీ 53 వేలు.. ఖాళీ అయినవి 10 వేలు!రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 53 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల పంపిణీ కొనసాగుతుండగా.. మిగతా కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల సంస్థ (టీజీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై కేటగిరీలలో 16,067 ఉద్యోగాలు భర్తీకాగా.. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా 11 వేల ఉద్యోగాలను, గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా 8,304 గురుకుల టీచర్ పోస్టులను, తెలంగాణ వైద్యారోగ్య సేవల నియామకాల సంస్థ (టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా 6,956 నర్సు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవిగాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో 10,006 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖ భర్తీ చేసింది. మరో 441 ఉద్యోగాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కారుణ్య నియామకాల కింద భర్తీ చేశారు. మొత్తంగా వీటన్నింటిలో కలిపి సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ అయి, ఆ వెంటనే ఖాళీ అయ్యాయి.అటకెక్కిన అవరోహణ విధానం..ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో ఒక క్రమపద్ధతిలో ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లలో ప్రకటించిన ఖాళీలను నూరు శాతం భర్తీ చేసేలా అవరోహణ విధానాన్ని పాటించాలని భావించింది. అంటే తొలుత పెద్ద కేడర్ పోస్టులను భర్తీ చేసి.. తర్వాత క్రమంగా దిగువ కేడర్ల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఉదాహరణకు తొలుత గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేసి... తర్వాత గ్రూప్–2, గ్రూప్–3, చివరగా గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలుత గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను ప్రకటించగా.. నియామక ఉత్తర్వులు కూడా జారీ అవుతున్నాయి. త్వరలో గ్రూప్–1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తే.. ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాలు సాధించినవారు వాటిలో ఎంపికైతే, గ్రూప్–4 ఉద్యోగాన్ని వదులుకుంటారు. అంటే భర్తీ అయిన పోస్టు ఖాళీ అయినట్టే.కానరాని సమన్వయం..రాష్ట్రంలో నాలుగు రిక్రూట్మెంట్ బోర్డులున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. పోలీసు నియామకాలు, గురుకుల కొలువులు, మెడికల్ సర్వీసులకు వేర్వేరుగా బోర్డులు ఏర్పాటు చేసింది. సంబంధిత శాఖలకు సంబంధించిన పోస్టులను ఆయా బోర్డుల ద్వారా భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా.. ఎవరికివారే అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవడంతో గందరగోళంగా మారింది. వాస్తవానికి కీలకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అనుసరిస్తూ ఇతర బోర్డులు కార్యాచరణ అమలు చేయాలి. ఇందుకు అన్ని నియామక సంస్థల మధ్య సమన్వయం అవసరం. కానీ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ మొదలు, తుది ఫలితాల ప్రకటన వరకు ఒక్కసారి కూడా నియామక సంస్థల మధ్య ఎలాంటి భేటీ జరగకపోవడం గమనార్హం.నియామక పత్రాల జారీ ఇలా..ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగ నియామక పత్రాల జారీ సాగింది. ప్రధానంగా ఎల్బీ స్టేడియం వేదికగా పంపిణీ ప్రక్రియ నిర్వహించారు. జనవరి 31న వైద్యారోగ్య శాఖ పరిధిలో నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు పోస్టులకు ఎంపికైన 6,959 మందికి నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 7న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 441 కారుణ్య నియామకాలు చేపట్టారు.⇒ ఫిబ్రవరి 14న పోలీసు, ఫైర్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలో 13,444 కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు.⇒ ఫిబ్రవరి 15న గురుకులాల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, పీజీటీలు కేటగిరీలలో 1,997 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ మార్చి 4న గురుకులాల్లో లెక్చరర్, టీచర్, మెడికల్ ఎంప్లాయీస్ కేటగిరీల్లో 5,192 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ సెప్టెంబర్ 26న వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో 687 మంది అపాయింట్ అయ్యారు. ⇒ తర్వాత గురుకులాల్లోని లైబ్రేరియన్, పీఈటీ, ఇంజనీరింగ్ కేటగిరీలో ఏఈఈ, అగ్రికల్చర్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీలకు సంబంధించి 1,635 మందికి నియామకపత్రాలు అందించారు.⇒ దసరా సందర్భంగా అక్టోబర్ 9న 10,009 మంది టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.⇒ ప్రజాపాలన ఏడాది ఉత్సవాల్లో భాగంగా వేర్వేరు రోజుల్లో ఇప్పటివరకు 8,143 మందికి నియామక పత్రాల పంపిణీ జరిగింది.అన్ని రకాల పోస్టుల్లో అదే ఖాళీలు..⇒ గురుకుల విద్యా సంస్థల్లో కూడా తొలుత పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) ఫలితాలను ప్రకటించి, నియామక ఉత్తర్వులు జారీ చేశాక.. అంతకంటే పెద్ద కేటగిరీలైన జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టడంతో వేలాది ఖాళీలు ఏర్పడ్డాయి. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తంగా 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా... విధుల్లో చేరింది సుమారు 6 వేల మందే. ఇలా గురుకుల పోస్టుల్లోనే 20శాతానికిపైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు మొదట భర్తీ చేసి, తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)ను భర్తీ చేస్తే నియామకాలు నూరుశాతం జరిగేవి. కానీ రెండు కేటగిరీల ఫలితాలు ఒకేసారి విడుదల చేసి, నియామక ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వెయ్యికి పైబడి ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి.⇒ పోలీస్ శాఖలో జరిగిన నియామకాల్లోనూ రెండున్నర వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయి.⇒ ఇప్పుడు గ్రూప్–4 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు విధుల్లో చేరేనాటికి మొత్తం 53వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు ఖాళీగా ఉండిపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
సర్కారీ కొలువుల పేరుతో ‘సైబర్’ వల!
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రభుత్వ రంగ సంస్థ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. భారీ నియామక ప్రకటన జారీ చేసి నిరుద్యోగులను బురిడీ కొట్టించేందుకు యత్నించారు. తెలంగాణ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించి.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రకటనను తలదన్నే రీతిలో 4,027 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు, వయో పరిమితి సడలింపులను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు సైతం ప్రకటించారు. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణను సైతం ప్రారంభించిన ఈ వెబ్సైట్ దరఖాస్తుదారుల వ్యక్తిగత, విద్యార్హతల వివరాల సేకరణతో పాటు పరీక్షల ఫీజు పేరుతో ఆన్లైన్ చెల్లింపుల విధానం ద్వారా రూ.98లను వసూలు చేస్తోంది. ఇది రాష్ట్ర ఐటీ శాఖ దృష్టికి రావడంతో అధికారులు పరిశీలించి నకిలీ వెబ్‌సైట్‌గా నిర్ధారించారు. ఆ శాఖ ఫిర్యాదుతో సైబర్ సెక్యూరిటీ విభాగం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్పందించిన తెలంగాణ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్.. తాము ఎలాంటి నియామకాలు జరపడం లేదని, నిరుద్యోగులు మోసపోరాదని ప్రకటించింది. -
ఉద్యోగ నియామకాల కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో చేపట్టనున్న ఉద్యోగ నియామకాల ప్రకటనలపై కసరత్తు మొదలైంది. ప్రాధాన్యత క్రమంలో తొలి విడతగా ఏయే పోస్టులకు ప్రకటనలు జారీ చేయాలి.. ఏయే పోస్టులు భర్తీ చేయాలి... అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. జూలై నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటికీ ఆర్థిక శాఖ వద్ద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 17,960 పోస్టులకు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. సీఎం ప్రకటనతో ఉద్యోగాల నియామకాల ఫైలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. కొన్ని విభాగాలు ఇప్పటికీ ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపించలేదని.. తక్షణం భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను ఒకరోజు వ్యవధిలోనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఇటీవలే అన్ని విభాగాల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో గడిచిన వారం రోజుల్లో వివిధ విభాగాల నుంచి అందిన పోస్టుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు సీఎస్‌కు నివేదించాయి. అందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులెన్ని.. అంతకు దిగువ కేడర్ పోస్టులెన్ని ఉన్నాయో విడివిడిగా వర్గీకరించాలని సీఎస్ సూచించారు. టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డీఎస్సీ, వివిధ శాఖల ఆధ్వర్యంలో భర్తీ చేయాల్సిన వివరాలన్నీ కేటగిరీల వారీగా అప్లోడ్ చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రాధాన్య క్రమంలో భర్తీ చేయాల్సిన 25 వేల పోస్టుల వివరాలను సిద్ధం చేయాలని.. మరో సారి సమావేశం కావాలని నిర్ణయించారు.


