సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లను వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఈరోజు ఫ్యూచర్ సిటీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్, ఐజీ రమేష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.
అనంతరం మహేష్ భగవత్ మాట్లాడుతూ.. బందోబస్తులో ఎలాంటి లోపం ఉండకూడదని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు 600 మంది దేశీ–విదేశీ ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, అక్టోపస్, గ్రేహౌండ్స్‌తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
సమ్మిట్ ప్రాంతంలో వెయ్యికిపైగా సీసీటీవీలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు వెయ్యి మంది సిబ్బందిని మోహరించడంతో పాటు రోడ్ల మార్పులు, బారికేడ్లు, పార్కింగ్ నిర్వహణ కోసం ప్రత్యేక మార్షల్స్‌ను నియమించనున్నారు. రెండు రోజుల పాటు కొన్ని మార్గాల్లో రహదారి మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.


