సాక్షి, సిద్ధిపేట జిల్లా: రూ.262.78 కోట్లతో హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్ ప్రజల అభిమానం మరవలేనన్నారు. ‘‘మీ ఓటుతో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ ప్రజాపాలనను తీసుకొచ్చిన రోజు డిసెంబర్ 3. మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేశాం. మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోంది’’ అని రేవంత్ చెప్పారు.
‘‘బీఆర్ఎస్ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కూలేశ్వరమైపోయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ ఎలా ఉంది. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం ఎలా ఉందో మీరే ఆలోచించండి. దేశంలో భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకూ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే ఇవాళ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి. ఇవాళ తెలంగాణా వరి దిగుబడుల్లో నంబర్ వన్ స్టేట్‌గా నిల్చింది. కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు కావాలంటే దొర గడీ ముందు చేతులు కట్టి నిల్చోవాల్సిన పరిస్థితి. ఆనాడు దొడ్డుబియ్యం ఇస్తే, మనం ఈరోజు 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.
..మీ పక్కన్నే గజ్వేల్, మరోవైపు సిద్ధిపేట, ఇంకోవైపు సిరిసిల్ల ఉన్నాయి. వాటిని దేవుళ్లేమైనా పాలిస్తున్నారా..?. ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయిగానీ, ఇక్కడి గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదో మీరు ఆలోచించాలి. ఇక్కడ ఓ ఆదర్శ గ్రామం అని చెప్పి చిన్నముల్కనూరును నాడు కేసీఆర్ ఏం చేశాడో మీకు తెలుసు. మేం వాళ్లలా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అందుకే మంత్రి పొన్నం నా ముందు పెట్టిన అన్ని విజ్ఞప్తులకూ నిధులందిస్తామని హామీ. ఆ సర్కార్ లో ఎవ్వరికీ పదేళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ, మేం ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తాం.
ఇవాళ మంచి ప్రభుత్వముంటే అభివృద్ధి, సంక్షేమం ఎలా ముందుకెళ్తాయో, గ్రామాల్లో కూడా మంచి సర్పంచ్‌ను ఎన్నుకుంటేనే మీ గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మంచివాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. వీలైనంతగా ఏకగ్రీవం చేసుకునే యత్నం చేయాలని పిలుపునిచ్చిన సీఎం రేవంత్.. సర్పంచులు కిరికిరిగాళ్లు వస్తే గ్రామాలు తిరోగమనం పడతాయంటూ వ్యాఖ్యానించారు.


