సాక్షి, హైదరాబాద్: కోకాపేట నియోపోలీస్ భూముల వేలంతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాసులపంట పడింది. ఆ భూములకు ఇవాళ మూడో విడత వేలం ముగిసింది. ప్లాట్ నంబర్స్ 19,20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు ధర పలికింది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరానికి 118 కోట్లు ధర పలికింది.
8.04 ఎకరాలకు గాను హెచ్‌ఎండీఏ వెయ్యి కోట్లు పొందింది. మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని 27 ఎకరాలకు 3,708 కోట్ల రూపాయలను హెచ్‌డీఏ దక్కించుకుంది. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో హెచ్‌డీఏ ఈ వేలం వేస్తోంది. కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాల భూమికి వేలం వేయనుంది. కోకాపేట గోల్డెన్ మైల్‌లోని 2 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు డిసెంబర్ 5న ఈ వేలం వేయనున్నారు.
కాగా, కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన రెండో విడత ఆన్‌లైన్ వేలంలో ఎకరం గరిష్టంగా రూ.151.25 కోట్ల ధర పలికింది. నియోపొలిస్‌లోని 15వ ప్లాట్‌లో ఉన్న 4.03 ఎకరాలకు, 16వ ప్లాట్‌లో ఉన్న 5.03 ఎకరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. అయితే 15వ ప్లాట్‌లో ఎక్కువ ధర పలికింది. 16వ ప్లాట్‌లో ఎకరాకు గరిష్టంగా రూ.147.75 కోట్లు లభించింది. సగటున ఒక ఎకరా రూ.142.83 కోట్లు చొప్పున అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.
9.06 ఎకరాల బిడ్డింగ్ ద్వారా మొత్తం రూ.1,352 కోట్లు లభించగా, ఈ నెల 24వ తేదీన విక్రయించిన భూములతో కలిపి ప్రభుత్వానికి రూ.2,708 కోట్లు ఆదాయం లభించింది. రెండేళ్ల క్రితం కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు లభించగా ఈసారి రెండు విడతల్లో రూ.137 కోట్ల నుంచి రూ.151 కోట్ల వరకు ధర పలకడం విశేషం.


