జలాశయంలో లోపాలు, కట్టడాల స్థిరత్వం తెలుసుకోవడానికి పరీక్షలు
సెన్సర్లు, కెమెరాల ద్వారా కీలక సమాచారం సేకరించనున్న అధికారులు
మరమ్మతుల కోసం నీటి నిల్వను 16.8 టీఎంసీల నుంచి 8.17 టీఎంసీలకు తగ్గించాలన్న సాంకేతిక కమిటీ
ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఆ మేరకు ఖాళీ చేయనున్న నీటిపారుదల శాఖ
సాక్షి, హైదరాబాద్: పెను ప్రమాదంలో ఉన్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నిర్వహణలో భాగంగా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీ ఆధారంగా మంగళవారం జలాశయానికి పరీక్షలు నిర్వహించారు. డ్రోన్‌ను జలాశయం అట్టడుగుకు పంపించి నీళ్ల కింద ఉన్న స్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.
డ్రోన్‌కు ఏర్పాటు చేసిన సెన్సర్లు, కెమెరాల ద్వారా కీలక సమాచారం సేకరించనున్నారు. త్వరలో జలాశయానికి మరమ్మతులు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారనుంది. జలాశయం అంతర్భాగంలో ఏమైనా లోపాలుంటే గుర్తించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిల్వలు 8.17 టీఎంసీలకు తగ్గింపు
హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగు, తాగునీటిని సరఫరా చేసే కీలకమైన సింగూరు జలాశయానికి తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే ఏ క్షణంలోనైనా జలాశయం తెగిపోయి దిగువ ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందంటూ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్‌ఆర్‌పీ) తన నివేదికలో తీవ్ర హెచ్చరికలు చేసింది.
దీంతో జలాశయానికి మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ బుధవారం జలసౌధలో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. సింగూరు జలాశయం గరిష్ట నీటిమట్టం 523.6 మీటర్లు, గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 520.58 మీటర్ల నీటిమట్టంతో 16.8 టీఎంసీల నిల్వలున్నాయి.
అయితే మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో నీటిమట్టాన్ని 517.5 మీటర్లకు, నిల్వలను 8.17 టీఎంసీలకు తగ్గించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అంటే, 8.63 టీఎంసీల జలాలను గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఒకేసారి భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే జలాశయానికి నష్టం జరిగే ప్రమాదం ఉండటంతో రోజుకి 0.3 మీటర్ల మేర నిల్వలను విడుదల చేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయించింది.
పూర్తిగా ఖాళీ చేయాలి..ఇప్పుడే వద్దు
జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేస్తేనే జలాశయం అడుగున ఉన్న భూ¿ౌతిక పరిస్థితులతో పాటు మట్టికట్టల స్థిరత్వాన్ని విశ్లేíÙంచడానికి అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సీఈ ఎం.సత్యనారాయణ రెడ్డి, సంగారెడ్డి సీఈ టి.శ్రీనివాస్ సాంకేతిక కమిటీ సమావేశంలో స్పష్టం చేశారు. జలాశయాన్ని 510.6 మీటర్ల వరకు ఖాళీ చేస్తేనే దానికి జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయగలమని సత్యనారాయణరెడ్డి వివరించారు.
మరోవైపు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలతో పాటు మిషన్ భగీరథ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జలాశయాన్ని 517.5 మీటర్ల మేరకే ఖాళీ చేయాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, జలమండలి డైరెక్టర్ డి.సుదర్శన్ సూచించారు. గోదావరి రెండో దశ ప్రాజెక్టు కింద మల్లన్నసాగర్ నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేసే పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని, ఆ తర్వాత జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేసుకోవాలని జలమండలి డైరెక్టర్ కోరారు.
అయితే వచ్చే వేసవి తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం సింగూరు జలాశయాన్ని 517.5 మీటర్ల మేరకు మాత్రమే ఖాళీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఆ మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు ప్రారంభించనున్నారు. నిర్దేశిత పరిమాణంలో నీళ్లను ఖాళీ చేసిన తర్వాత సాంకేతిక కమిటీ మరోసారి జలాశయాన్ని పరిశీలించనుంది. మరమ్మతుల కోసం మరింతగా ఖాళీ చేయాల్సిన అవసరముందని గుర్తిస్తే ఆ మేరకు తదుపరి సిఫారసులు చేయనుంది.
796 మీటర్ల మేర కరకట్టలు ధ్వంసం
‘సింగూరు జలాశయానికి ఎగువ మట్టి కట్టల (అప్‌స్ట్రీమ్ ఎర్త్ డ్యామ్)కు రక్షణగా రాళ్లతో ఏర్పాటు చేసిన రివిట్‌మెంట్‌తో పాటు మట్టి కట్టలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల అప్‌స్ట్రీమ్ స్లోప్‌కి రక్షణగా ఉన్న రివిట్‌మెంట్ దెబ్బతింది. ఒరిజినల్ డిజైన్ల ప్రకారం జలాశయంలో నిల్వలు 517.8 మీటర్లకు మించకుండా నిర్వహించాలి. అయితే మిషన్ భగీరథ అవసరాల కోసం 520.5 మీటర్లకు తగ్గకుండా నిల్వలను నిర్వహించాలని 2017 అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో 885 జారీ చేసింది.
గత కొన్నేళ్లుగా సామర్థ్యానికి మించి నిరంతరంగా 522 మీటర్ల మేర నిల్వలను కొనసాగిస్తుండడంతో జలాశయం తీవ్రంగా దెబ్బతింది. అప్‌స్ట్రీమ్ రివిట్‌మెంట్‌కు మరమ్మతులు నిర్వహించి పూర్వ స్థితికి పునరుద్ధరించకపోవడంతో జలాశయం కట్టలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. జలాశయానికి 6.5 కి.మీల పొడవైన కరకట్టలుండగా, పలు చోట్ల మొత్తంగా 796 మీటర్ల మేర కరకట్టలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అత్యవసరంగా రివిట్‌మెంట్‌కి మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించకపోతే ఏక్షణంలోనైనా మట్టి కట్టలకు గండిపడి లోతట్టు ప్రాంతాలను ముంచే ప్రమాదం ఉంది..’అని డీఎస్‌ఆర్‌పీ గతంలో హెచ్చరించింది.
త్వరలో మరమ్మతులు, లైనింగ్
సింగూరు మరమ్మతుల కోసం 2021లో రూ.16 కోట్ల వ్యయానికి ప్రభుత్వం అనుమతించగా, నిరంతరం నిల్వలను కొనసాగించడంతో మరమ్మతులు సాధ్యం కాలేదు. అయితే ఎట్టకేలకు మరమ్మతులు నిర్వహించాలని నిర్ణయించడంతో ఇటీవల టెండర్లు పిలిచి రూ.13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
జలాశయం కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఇవ్వనుండడంతో కాల్వలకు లైనింగ్ చేసుకోవడానికి సైతం వీలు కలిగింది. రూ.140 కోట్లతో లైనింగ్ పనులకు ఇప్పటికే కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకోగా, త్వరలో ఈ పనులు కూడా ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.


