12 మంది మావోయిస్టులు మృతి
ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు కూడా.. మరో ఇద్దరికి గాయాలు
కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసు బలగాలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం కథనం ప్రకారం.. బీజాపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.
దీంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడికి (అంబుష్) దిగారు. పోలీసు బలగాలపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. అయితే వారు ఏయే ప్రాంతాలకు చెందిన వారనేది గుర్తించాల్సి ఉంది.
బీజాపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు జవాన్లు మోనూ వాడాది (హెడ్ కానిస్టేబుల్), దుకారు గోండే, రమేష్ సోధీ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. సోమ్‌దేవ్ యాదవ్‌తో పాటు మరో జవాన్ గాయపడ్డారు. వీరిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా కూంబింగ్ మరింత ముమ్మరం చేసినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. సంఘటనా ప్రాంతం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్, త్రీనాట్ త్రీ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇప్పటివరకు 275 మంది ఎన్‌కౌంటర్
జిల్లాలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగు తోందని ఐజీ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 275 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 246 మంది మరణించారు.


