రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పిన ఐ బొమ్మ రవి
పైరసీ చేయడం మానేస్తానని పోలీసుల విచారణలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఐ బొమ్మ, బప్పం పేర్లతో వెబ్‌సైట్లను ఏర్పాటు చేసి, 21 వేల సినిమాలను పైరసీ చేసిన ఇమ్మంది రవి తన పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలను విక్రయించాలని యోచిస్తున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో రవి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ఇమ్మంది రవిపై హైదరాబాద్‌లో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి.
తొలుత ఓ కేసులో అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో ఓసారి కస్టడీకి, మరోసారి అదనపు కస్టడీకి తీసుకున్నారు. ఆపై మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ కోసం పిటిషన్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రెండు కేసుల్లో ఈ తంతు పూర్తి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసుల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారి అరెస్టు చేసిన నాటికి, ఇప్పటికి అతడిలో ఎంతో మార్పు కనిపిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.
తమకు చిక్కినప్పుడు సినిమా టికెట్ల రేట్లు, హీరోల రెమ్యూనరేషన్ల విషయాలు మాట్లాడి, తన పనిని సమర్థించుకున్నాడని, ప్రస్తుతం పైరసీ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నాడని అధికారులు తెలిపారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ లేదా తన స్వస్థలమైన విశాఖపట్నంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పోలీసులతో చెప్పాడు.
అలాగే తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రి చిన అప్పారావు వద్దకూ వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. భార్య నుంచి దూరమైన నాటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఇక్కడ, తండ్రి అక్కడ ఒంటరి జీవితం గడుపుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నాడు. అనారోగ్యంతో, తన తల్లి నుంచి దూరంగా బతుకుతున్న తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటానని పోలీసులకు తెలిపాడు.


