మత్తెక్కిన ముఠాలు..బానిసలైన విద్యార్థులు! | Marijuana gang sales targeting colleges and high schools | Sakshi
Sakshi News home page

మత్తెక్కిన ముఠాలు..బానిసలైన విద్యార్థులు!

Dec 4 2025 5:47 AM | Updated on Dec 4 2025 5:47 AM

Marijuana gang sales targeting colleges and high schools

మత్తుకు చిత్తవుతున్న యువత

పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న విద్యార్థులు 

కాలేజీలు, హైస్కూకళ్లు లక్ష్యంగా గంజాయి ముఠా విక్రయాలు 

నేడు హైస్కూకళ్లకు చేరిన గంజాయి వ్యసనం 

 గ్రామాల్లోనూ జోరుగా విక్రయాలు 

ఒడిశా నుంచి వయా విశాఖ మీదుగా జిల్లాకు  

పోలీసుల తనిఖీల్లో బయటపడిన నివ్వెరపోయే నిజాలు

గంజాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడా మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ముఠా విసురుతున్న వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. 

వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారిని పెడదారి పట్టిస్తోంది. ఇటీవల పోలీసు టాస్‌్కఫోర్స్‌ తనిఖీల్లో ఎక్కువగా విద్యార్థులు పట్టుబడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించామని బాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఏ మండలంలో చూసినా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా టాస్‌్కఫోర్స్‌ తనిఖీలు నామమాత్రంగా జరుగుతుండడంతో జిల్లా సరిహద్దులను, జిల్లాకు సమీపంలో ఉన్న మండలాలను కేంద్రంగా చేసుకొని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. 

ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేటతెల్లం అవుతోంది. టీనేజీ పిల్లలు, మైనర్‌లు గంజాయికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారారు. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు మాని కార్యాచరణలో పనితనం చూపాలని తలిదండ్రులు, సామాజికవేత్తలు కోరుతున్నారు. 

గంజాయి మత్తులో విద్యార్థులు... 
గత వారం నగరంలోని టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి బ్యాచ్‌ మీద దాడి చేసి పట్టుకున్నారు. అందులో అంజయ్య రోడ్డులోని ఒక ప్రైవేటు హైస్కూకలులో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులు కూడా ఉండడంతో విస్తుపోయారు. రెండు రోజుల క్రితం మరో బ్యాచ్‌ గురించి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్‌ పోలీసులకు కోర్టు సెంటర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. 

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్‌ రాజు గంజాయి వినియోగిస్తున్న బ్యాచ్‌ పై దాడులకు ఆదేశించారు. ఈ దాడుల్లో నగరంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీ విద్యార్థులు రెండంకెల సంఖ్యలో పట్టుబడ్డారు. నగర శివారుల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో దొరికారు. వీరిలో కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తొలి తప్పుగా హెచ్చరించి పంపించేశారు. మరి కొందరిని మాత్రం జీజీహెచ్‌లోని ఎడిక్షన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స చేయించి పంపించారు.  

కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం...  
ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ఆయా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గంజాయి తాగుతున్న వారిని గుర్తించి, వారు మరొకరికి అలవాటు చేయకుండా కాలేజీ యాజమాన్యాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో కాలేజీలు గంజాయి అడ్డాగా మారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 

జిల్లాలో ఇదీ పరిస్థితి... 
జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, దర్శి పరిసర ప్రాంతాలు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి టౌన్, మర్రిచెట్లపాలెం ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారినట్లు తెలుస్తుంది. జిల్లా సరిహద్దుల్లోని బాపట్ల జిల్లా అద్దంకి, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేసుకొని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. 

ఇటీవల చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలు వన్‌టౌన్, టూ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలో 10 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం గంజాయి విక్రేతలను మాత్రమే కాకుండా సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల 5 మంది గంజాయి సేవించిన వారిపై కేసు నమోదు చేయడం గమనార్హం.  

విశాఖ నుంచి రైళ్లలో ... 
ఒడిశా నుంచి విశాఖ పట్టణం గుండా రైళ్ల ద్వారా గంజాయిని తరలించి ఒంగోలులో విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీల్లో రైళ్లలో గంజాయి పట్టుబడడం ఇటీవల నిత్యకృత్యమై పోయింది. పోలీసులకు పట్టుబడిన గంజాయి కంటే వారి కళ్లు గప్పి రవాణా చేస్తున్న గంజాయే ఎక్కువగా ఉంటోందని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రైళ్లలో తనిఖీలు జరుగుతుండడంతో ఇతర మార్గాల ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆటోలు, ఆర్టీసీ బస్సుల ద్వారా  గంజాయిని ఒంగోలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటినే గంజాయి డెన్‌గా మార్చిన విద్యార్థి..
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో నగరంలో ఒక విద్యార్థి ఇంటినే గంజాయి డెన్‌గా మార్చుకోవడం చూసి విచారణ అధికారులు నివ్వెరపోయా­రు. పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించిన సదరు విద్యార్థి తన స్నేహితులకు కూడా గంజాయిని అలవాటు చేసినట్లు చెబుతున్నారు. గంజాయి సేవిస్తున్న విద్యార్థులు కొందరు రాత్రి పూట పార్టీలు చేసుకోవడం, బర్త్‌ డే పార్టీ పేరుతో గంజాయి తాగడం ఎక్కువై పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. 

అర్ధరాత్రి వరకు బయట స్నేహితులతో తిరిగి ఏ అపరాత్రో  ఇంటికి వచ్చి పగలంతా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయికి అలవాటు పడిన విద్యార్థుల నడవడిక తీవ్రంగా ఉంటోందని, హై స్పీడ్‌ మోటారు బైకులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నారని, చీటికీ మాటికీ తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఏడిపిస్తున్నారని సమాచారం. మరికొందరు విద్యార్థులు గంజాయి కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక చోరీలు చేయడం, నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసు నివేదికల ద్వారా తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement