పింఛన్ డబ్బు నుంచి ఇంటి పన్ను మినహాయించుకుంటున్న ఉద్యోగి.. పింఛన్ డబ్బు నుంచి ఇంటి పన్ను చెల్లించిన రశీదు
లబ్ధిదారుల తిరుగుబాటుతో తోకముడిచిన ప్రభుత్వం
కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో ఘటన
తుని రూరల్: సామాజిక భద్రతగా అందించాల్సిన పింఛన్ల సొమ్ము నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వంపై లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్థానికుల సమాచారం మేరకు..ఈ నెల 1న కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ చేపట్టారు. పింఛన్లు పొందుతున్న కొంతమంది నుంచి ఇంటి పన్ను సొమ్ము మినహాయించి మిగతాది ఇచ్చారు.
ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వం పింఛన్ నిలిపివేస్తుందన్న భయంతో కొంతమంది ఇంటి పన్ను చెల్లింపునకు అంగీకరించారు. పలివెల దేవుడమ్మ పింఛన్ నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తుండగా ఆమె కుమార్తె తీవ్రంగా వ్యతిరేకించి సచివాలయ సర్వేయర్ సురేష్‌ను నిలదీసింది. మిగిలిన పింఛన్‌దారులు ఆమెకు మద్దతు పలికారు. దీంతో పింఛన్ డబ్బు చెల్లించి సర్వేయర్ వెనుతిరిగారు.అలాగే, యండగుడ నూకాలమ్మ నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను రూ.243 మినహాయించుకుని పింఛన్ ఇచ్చినట్లు బాధితురాలు చెప్పారు.
మరికొంతమంది నుంచి పింఛన్ డబ్బులోనుంచే ఇంటి పన్నులు మినహాయించుకుని రశీదులు ఇచ్చినట్లు తెలిసింది. కొడుకు ఇంటి పన్ను చెల్లించలేదని అతని తల్లికి పింఛన్ 2 రోజులు నిలిపివేసినట్లు ఆరోపించారు. కాగా, ఇంటి పన్నులు గత నెల నుంచీ వసూలు చేస్తున్నామని, కొంతమంది ఒకటో తేదీకి కడతామని చెప్పడంతో అడిగినట్లు సచివాలయ కార్యదర్శి స్వామి తెలిపారు. ఎవరి నుంచీ తమ సిబ్బంది బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయలేదని, పింఛన్ డబ్బు నుంచి మినహాయించుకోలేదని అన్నారు.


