మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.
సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు.


