ఆ స్థానంలో ఉద్యానపంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి
రైతన్నా మీకోసం.. సభలో సీఎం చంద్రబాబునాయుడు
సాక్షి, రాజమహేంద్రవరం/నల్లజర్ల: వరి సాగు వల్ల ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేవని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరిస్థానంలో ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగులో టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపామని, వంశధారకు కలుపుతామని, పెన్నానది వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరవు ఉండదని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి నీరు ఇస్తే నల్లజర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కరవు ఎక్కువగా ఉండే రాయలసీమ నంద్యాల జిల్లాలో భూగర్భ జలాలు నాలుగు మీటర్లకు పెరిగాయన్నారు. తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని చెప్పారు.
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోను ‘దివ్యాంగ్ భవన్’లు ఏర్పాటు చేస్తామన్నారు.
విశాఖపట్నంలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసిబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని, వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు.


