విశాఖపట్నం: మన శరీరంలో క్లోమం (పాంక్రియాస్) అత్యంత కీలకం. అదే సమయంలో బాగా సున్నితం. అలాంటి పాంక్రియస్‌లో కణితి ఏర్పడితే చాలా ప్రమాదకరం. కేవలం ఎనిమిదేళ్ల వయసులో అలాంటి ఇబ్బంది వచ్చిన ఒక పాపకు.. సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అధునాతన పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్, హెపటో-బైలియరీ, పాంక్రియాటిక్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు.
“విశాఖ నగరానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చింది. ఈ చిన్న పాపను గ్యాస్ట్రోఎంటరాలజీ చీఫ్ డా. ఆచంట చలపతి రావు గారు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షించ చేసి, ఇది అత్యంత అరుదైన సాలిడ్ సూడోపాపిలరీ ఎపితెలియల్ నియోప్లాజమ్ (స్పెన్) అనే పాంక్రియాటిక్ కణితి ఉన్నట్లు తేలింది. భారత దేశంలో ఈ తరహా సమస్యకు శస్త్రచికిత్స జరిగిన అత్యంత చిన్నవయసు రోగిగా ఈ పాప చరిత్ర సృష్టించింది. పాపకు పాంక్రియాస్‌లో కణితి ఉండడం, అది అత్యంత అరుదైనది కావడంతో దాంట్లో క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నా, తర్వాత ఎలాంటి సంక్లిష్ట సమస్యలు రాకూడదంటే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని నిర్ణయించాం.
మూడు గంటల పాటు అత్యంత కచ్చితత్వంతో కీహోల్ సర్జరీ (లాప్రోస్కోపిక్ సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ)మొదలుపెట్టాం వీలైనంత వరకు రక్తస్రావం లేకుండా చూడడంతో పాటు, పాంక్రియస్ కణజాలాన్ని కూడా వీలైనంత వరకు కాపాడుకుంటూ కణితి మొత్తాన్ని తొలగించగలిగాం. ఈ శస్త్రచికిత్స తర్వాత బాలిక చాలా త్వరగా కోలుకుంది. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఐదు రోజుల్లోనే పాపను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. ఇప్పుడు ఆమె స్కూలుకు కూడా వెళ్తూ చదువులో, ఆట లో చక్కగా రాణిస్తోంది.
ఇలాంటి అత్యంత అరుదైన పాంక్రియాటిక్ కణితులను తొలగించడంలో ఉన్న నైపుణ్యాలకు ఈ శస్త్రచికిత్సే నిదర్శనం. ఇలాంటి కణుతులు చాలా అరుదైనప్పటికీ, తమ అనుభవంలో గత పదేళ్ళలో 12 గుర్తించి వైద్యం చేశాం అని శస్త్ర చికిత్స నిపుణులు డా. మురళీధర్ నంబాడ వివరించారు. ఇలాంటివి త్వరగా గుర్తించడం, అసాధారణ సర్జికల్ నైపుణ్యాలు ఇలాంటి అరుదైన పరిస్థితుల్లో చాలా కీలకం.
ఇలాంటి కేసుల్లో కూడా అత్యంత సురక్షితమైన ఫలితాలను తీసుకురావడంలో కిమ్స్ ఆస్పత్రికి పేరుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటి సమస్యలు వచ్చినవారు ఇక పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పిల్లలు, పెద్దలకు ఇలాంటి కీహోల్ శస్త్రచికిత్సల విషయంలో కిమ్స్ ఆస్పత్రి పేరు ప్రఖ్యాతులను ఈ శస్త్రచికిత్స మరింత పెంచింది” అని డాక్టర్ మురళీధర్ నంబాడ తెలిపారు. ఈ శాస్త్ర చికిత్స లో సర్జికల్ టీమ్ డా. రవి చంద్రారెడ్డి, డా. గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు.


