‘అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడి అమానుషం’ | Nalamaru Chandrasekhar Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడి అమానుషం’

Mar 4 2026 7:22 PM | Updated on Mar 4 2026 7:49 PM

Nalamaru Chandrasekhar Reddy Fires On Chandrababu Government

సాక్షి, తాడేప‌ల్లి: అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడి అమానుష‌మ‌ని, ఎన్నిక‌ల హామీలు అమ‌లు చేయాల‌ని కోరుతూ శాంతియుతంగా నిర‌స‌న తెలియజేస్తున్న అక్క‌చెల్లెమ్మ‌లను దారుణంగా వేధించింద‌ని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ అధ్య‌క్షుడు న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అంగ‌న్‌వాడీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వేత‌నాలు పెంచుతాన‌ని, సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు గ్రాట్యుటీ చెల్లిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, రెండేళ్లుగా మ‌భ్య‌పెడుతూ వ‌చ్చార‌ని వివ‌రించారు.

టెంట్‌లో ఉండి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ ఉన్న మ‌హిళ‌లను వేకువ జామున ఒక్క‌సారిగా ఈడ్చి వ్యాన్‌ల‌లోకి త‌ర‌లించ‌డం హేయమ‌ని చ‌ర్య‌గా పేర్కొన్నారు. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల‌కు వైయ‌స్సార్సీపీ అండ‌గా ఉంటుంద‌ని, ఎంప్లాయీస్ అండ్ పెన్ష‌న‌ర్స్ వింగ్ త‌ర‌ఫున పోరాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఖ‌చ్చితంగా మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

రెండేళ్లుగా మ‌భ్య‌పెడుతున్నారు
ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తున్న అంగ‌న్‌వాడీల ప‌ట్ల ప్ర‌భుత్వం అత్యంత అమానుషంగా వ్య‌వ‌హ‌రించింది. ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల‌కు పిలుస్తామ‌ని ముందురోజు రాత్రి న‌మ్మ‌బ‌లికి వేకువ‌జామున టెంట్లు కూల్చేసి అక్ర‌మంగా అరెస్టు చేశారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అంగ‌న్‌వాడీ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వేత‌నాలు పెంచుతాన‌ని, సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు గ్రాట్యుటీ చెల్లిస్తామ‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతోంది.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక దఫాలు శాంతియుతంగా నిరసనలు తెలిపిన అంగన్‌వాడీలను చంద్రబాబు ప్రతిసారీ మభ్యపెడుతూ వచ్చారు.

ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సోమవారం నిర్వహించిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీగా పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరూ నిద్రిస్తుండగా వందలాది మంది మగ పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి అంగన్‌వాడీ మహిళలను ఈడ్చి పారేశారు. వారు తేరుకునేలోగా టెంట్లు పడేసి, ప్లెక్సీలు చించేసి, ప్లకార్డులు విసిరేసి, అంతా చిందరవందర చేసేశారు. అంగ‌న్‌వాడీల ప‌ట్ల ప్ర‌భుత్వం పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును వైయ‌స్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వారికి పార్టీ అండ‌గా ఉండి వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తుంది.

హామీ అమ‌లు చేయాల‌ని కోర‌డం త‌ప్పా?
శాంతియుతంగా ఉద్యమించిన మహిళలపై కర్కశంగా వ్యవహరించింది. రోడ్డు పైనే సొమ్మసిల్లిన అంగన్‌వాడీలపై చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి విరుచుకుపడింది. అంగన్‌వాడీలు తేరుకుని ఏం జరుగుతోందో గ్రహించేలోపే మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేసి పోలీసు వ్యాన్‌లలోకి ఎక్కించేశారు. గ‌తంలోనూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న అంగన్‌వాడీల‌ను గుర్రాల‌తో తొక్కించిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది. అంగన్‌వాడీలు బయటకు వెళ్లే అవకాశం లేకుండా చుట్టూ రోప్‌ పార్టీతో పోలీసులు దిగ్బంధించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన వారిని కనీసం బ్యాగులు, సెల్‌ఫోన్లు కూడా తీసుకోనివ్వకుండా నిర్బంధించారు. చేతికి దొరికిన వారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యాన్లలోకి తోసేశారు. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అని ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా గెంటేశారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో పలువురు అంగన్‌వాడీ వర్కర్లు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమను అక్రమంగా అరెస్ట్‌ చేసి కనీసం టాయిలెట్స్‌కు వెళ్లడానికి కూడా అనుమతించలేదని అంగన్‌వాడీ వర్కర్స్ వాపోతున్నారు. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు చూసి దేశవ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

మూల్యం చెల్లించుకోక తప్ప‌దు
అంగ‌న్‌వాడీలు మాత్ర‌మే కాదు.. టీచ‌ర్లు, ఇత‌ర ఉద్యోగ సంఘాల నాయ‌కులు, పెన్ష‌న‌ర్లు ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని కోరుతూ ఇప్ప‌టికే అనేక‌సార్లు విన‌తులు, నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. అయినా ప్ర‌భుత్వం నుంచి క‌నీస స్పంద‌న ఉండ‌టం లేదు. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఉన్న పీఆర్సీ చైర్మ‌న్ తో రాజీనామా చేయించిన చంద్ర‌బాబు.. రెండేళ్లుగా కొత్త పీఆర్సీ క‌మిష‌న్ వేయ‌కుండానే కాల‌యాప‌న చేస్తున్నారు.

క‌నీసం ఒక‌టో తేదీన జీతాలు ఇస్తామ‌న్న హామీని కూడా నిల‌బెట్టుకోలేదు. ఉద్యోగుల‌కు రావాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్ల బ‌కాయిలు ఇవ్వ‌కుండా వేధిస్తున్నారు. బినామీ కంపెనీల‌కు 99పైస‌ల‌కు వేల కోట్ల విలువైన భూములు క‌ట్ట‌బెట్ట‌డానికి ఉత్సాహం చూపిస్తున్న ప్ర‌భుత్వం... ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించడం లేదు. ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేయ‌క‌పోతే దానికి ఖ‌చ్చితంగా మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దని న‌ల‌మారు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement